ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటేనే ఎన్నికల్లో పోటీ చేసేలా చట్టం చేస్తానని చంద్రబాబు లైటర్ వీన్లో ప్రజల్ని బెదిరిస్తున్నారు. కుటుంబానికి పదహారు మంది పిల్లలు ఉండాలని చిన్న కుటుంబాలు ఇప్పుడున్న పరిస్థితులకు సరిపోవని తమిళనాడు సీఎం స్టాలిన్ అంటున్నారు. ఈ ఇద్దరు సీనియర్ నేతలు చెప్పేది ఒక్కటే… ఎక్కువ మందిని కనండి.. జనాభాను పెంచండి అని. వారు చెప్పే విషయంలో లాజిక్ ఉంది. కానీ ఆ పుట్టించే బిడ్డల భవిష్యత్‌కు ఎవరు భరోసా ఇస్తారో కూడా చెబితే ప్రజల్లో స్పష్టత వస్తుంది. లేకపోతే ఆ ప్రకటనల్ని.. వాళ్లకేమీ చెబుతారు అని.. కామెడీగానే తీసుకుంటారు.
జపాన్, చైనా సమస్య దక్షిణాదికి !
దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అని గురజాడ ఎప్పుడో చెప్పారు. కానీ పెరిగిపోతున్న మనుషుల్ని చూసి భయపడిన ప్రపంచం వారిని భూమి మీదకు రాకుండానే నియంత్రించాలని అనుకుంది. ముఖ్యంగా ఆసియా దేశాలు ఆ పని చేశాయి. చైనాలో అయితే రెండో బిడ్డల కంటే కఠిన శిక్షలు అమలు చేశారు. జపాన్ లో ఇప్పుడు యూత్ లేరు. చాలా దేశాల్లో ఇలాంటి సమస్య ఉంది. మన దేశంలో జనాభా నియంత్రణను పక్కాగా అమలు చేసిన దక్షిణాది అదే సమస్యలో ఇరుక్కుపోతోంది. మేలుకోకపోతే దక్షిణాది వృద్ధ ప్రదేశం అవుతుంది. జనాభాను నియంత్రించని ఉత్తరాదిదే రాజ్యం అవుతుంది.
పిల్లల్ని పెంచడం ఇప్పుడు ఆషామాషీ కాదు !
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఆర్థికంగా ఆధారపడేందుకు భూములు, వ్యవసాయం ఇతర ఆదాయాలు ఉండేవి. ఇంటిల్లిపాది కష్టపడి అందరూ తిని పుట్టిన పిల్లలందర్నీ చూసుకునేవారు. ఇప్పుడు అన్నీ చిన్న కుటుంబాలే. పిల్లల్ని పోషించడం పెను భారంగా మారింది. ప్రభుత్వాలు చెప్పకపోయినా ఒక్కరు చాలు అనుకుంటున్నారు. కాస్త అర్థికంగా పర్వాలేదు అనుకున్నవారే రెండో బిడ్డ వైపు చూస్తున్నారు. అందుకే జననాల రేటు తగ్గిపోతోంది. అంటే ప్రభుత్వం చెప్పిందని దేశానికి భారం అవుతుందని పిల్లల్ని కనడం ఆపలేదు. పెంచడం కనాకష్టంగా మారుతుంది కాబట్టే తగ్గించుకుంటున్నారు.
ప్రభుత్వమే పోషిస్తామన్నా పిల్లల్ని ఎక్కువగా ఇక కనరరు !
చైనా, జపాన్‌లో అన్నీ చూసుకుంటామంటున్నా పట్టించుకోవడం లేదు.. అక్కడ చైనా ఇప్పుడు మూడో బిడ్డను కంటే భారీగా బహుమతులు ఇస్తోంది. ఆ పిల్ల లేదా పిల్లవాడికి అయ్యే ప్రతి రూపాయి ప్రభుత్వమే భరిస్తామంటోంది. జపాన్ లోనూ అంతే. అయితే ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. ఆయా దేశాల్లో అలా ఉంటే ఇండియాలో పిల్లల్ని కంటే కనీసం వ్యాక్సిన్స్ కూడా ఫ్రీగా వస్తాయో లేదో చెప్పలేని పరిస్థితి. విద్య , వైద్యం ఉచితంగా రాదు. ప్రతీది ఖర్చే ఇలాంటి సమయంలో… పిల్లల్ని కనేందుకు చంద్రబాబు, స్టాలిన్ పిలుపునిచ్చినంత మాత్రాన ఎవరూ ముందుకు రారు.