ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతుల సంఖ్య అధికారికంగా గుర్తించింది 43.2 లక్షల మంది. కానీ ఏపీ సర్కార్ 64 లక్షల మంది రైతులకు .. భరోసా పథకం కింద రూ. 12,500 మంజూరు చేయబోతోందట. ఈ విషయాన్ని మంత్రి కన్నబాబే ప్రకటించారు. మొత్తంగా 64 లక్షల మంది రైతులకు లబ్ధి కలుగుతుందని.. రుణమాఫీతో పోలిస్తే అదనంగా 27.38 లక్షల మందికి సాయం చేయబోతున్నారట. ఇంత మంది రైతులు ఎలా పెరిగారనేది.. చాలా మందికి అర్థం కాని విషయం. బహుశా.. తెలంగాణ రైతుల్నీ కలిపారేమో.. అనే సెటైర్లు కూడా ప్రారంభమయ్యాయి. కౌలు రైతుల రికార్డులు తీస్తే.. ఎడెనిమిది లక్షల మంది కూడా లేరు. పీఎం కిసాన్ పథకానికి.. దీన్ని అనుసంధానం చేశారు కాబట్టి… ఏపీలో పీఎం కిసాన్ యోజన పథకం కింద మొదటి విడతలో 42.5లక్షల మందికి రెండు వేల రూపాయలను నేరుగా వారి ఖాతాల్లోకి వచ్చాయి. వీరిలోనూ.. కేంద్రం రెండో విడతల ఫిల్టర్ చేసి 30 లక్షల మందికి మాత్రమే ఇస్తోంది. ఇప్పుడు సర్కార్..ఈ సంఖ్యను డబుల్ చేసి చెబుతోంది.
ఇప్పటికే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీల కౌలు రైతులకు మాత్రమే భరోసా ఇస్తామని ప్రకటించింది. రైతుల్లోనూ.. అర్హుల కోసం.. అంటూ.. మార్గదర్శకాలు విడుదల చేసింది. రైతులైనా .. రిటైర్డ్ ఉద్యోగులైనా , ఏ రూపంలో అయినా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నా.. ఆదాయపు పన్ను కట్టినా, నెలకు రూ. పది వేలు పెన్షన్ పొందుతున్నా, ఉద్యాన, పట్టు, వ్యవస్థీకృత భూ యజమానులు అయినా.. ఈ పథకానికి అనర్హులు. ఇలా పెట్టిన నిబంధనలతోనే.. సగం మంది అనర్హులయ్యారు. పాదయాత్రలో రైతులందరికీ సాయం చేస్తామని కులం, మతం లాంటివేమీ చూడబోమని ప్రకటించారు. రైతులు వర్గాలకు అతీతంగా కష్టాల్లో ఉన్నారని.. సాగు చేసి నష్టపోయారని.. అందరినీ ఆదుకుంటానని జగన్ హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా పథకానికి సవా లక్ష నిబంధనలు పెడుతున్నారు.
ప్రభుత్వం రూ. 12500 అని ప్రచారం చేస్తోంది. కానీ.. ఇందులో కేంద్రం కిసాన్ సమ్మాన్ కింద ఇచ్చే రూ. 6వేలు కలసి ఉన్నాయని రాష్ట్రం చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ నుంచి రైతుకు పంట పెట్టుబడి సాయాన్ని మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను నేరుగా రైతు ఖాతాల్లోకి వేస్తోంది. ఈ పథకాన్ని అనుసంధానిస్తూ వైఎస్సార్ రైతు భరోసాను అమలు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అంటే.. ప్రభుత్వం రూ. 6,500 మాత్రమే ఇస్తుంది. కేంద్ర పథకం అమలు తీరు ఒక విధంగా.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోయే పథకం తీరు మరో విధంగా ఉండడంతో రెండింటినీ అనుసంధానించుకుంటూ పథకాన్ని అమలు చేయాల్సిఉంది. నేరుగా రాష్ట్రం రూ. 6,500 మాత్రమే రైతులకు ఇవ్వబోతోందన్నమాట.