రైతులు సంతృప్తి చెందకపోతే మనం ఎంత చేసినా ఏం చేసినా వృథా అవుతుందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వ్యవసాయ, అనుబంధ రంగాల శాఖల అధికారులతో సమీక్ష సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సేవల మీద రైతులకు నమ్మకం కలగాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నవారిపై కఠినంగా చర్యలుండాలని అధికారులను ఆదేశించారు. అక్రమాలు దృష్టికి వస్తే ఎంతటివారినైనా జైలుకు పంపేందుకు వెనకాడొద్దన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి అవసరమైత ఒక కొత్త చట్టం తీసుకొద్దామని, దానిపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు జగన్. అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాలు ప్రారంభం కాబోతున్నాయనీ, అవి రైతులకు మెరుగైన సేవలు అందించే కేంద్రాలుగా పనిచేయాలని సీఎం ఆకాంక్షించారు. విత్తనాలు, ఎరువుల పంపిణీ గ్రామ సచివాలయం నుంచే జరగాలని జగన్ ఆదేశించారు.
రైతులకు రూ. 12,500 చొప్పున ఆర్థిక సాయం అందించే రైతు భరోసా పథకాన్ని అక్టోబర్ 15 నుంచి అమల్లోకి తెస్తున్నట్టు ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. గత టీడీపీ సర్కారు అమలు చేసిన అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. రైతు భీమా సౌకర్యంపై కూడా మాట్లాడుతూ… దాన్ని సక్రమంగా అమలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఈ బీమాకు సంబంధించిన ప్రీమియం కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. దాదాపు రూ. 3 వేల కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామనీ, దీనికి సంబంధించి బడ్జెట్ లో ప్రతిపాదన ఉంటుందన్నారు.
ఈ సందర్భంగా అధికారుల గురించి మాట్లాడుతూ… ప్రభుత్వానికి ఉపయోగపడుతూ, ప్రజలకు మేలైన సేవలు అందించే విధంగా ఉండే సలహాలు ఇవ్వాలని జగన్ కోరారు. మంచి సలహాలు ఇచ్చే అధికారులను తాను సన్మానిస్తాని జగన్ చెప్పారు. అధికారులు పారదర్శకంగా పనిచేయాలనీ, రైతులకు సంబంధించిన ఏ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా చేయాలని జగన్ సూచించారు. వ్యవసాయ శాఖ రివ్యూలో జగన్ తీసుకున్న నిర్ణయాలు అత్యంత కీలకమైనవిగానే చూడాలి. గ్రామ సచివాలయాల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి తేస్తే… అన్నదాతకు అదే కొండంత అండ అవుతుంది. వ్యవసాయం రైతుకు లాభసాటి కాకపోవడానికి ప్రధాన అవరోధాల్లో కీలకమైన జాడ్యాలే ఈ నకిలీ విత్తనాలు, మండిపోయే ఎరువుల ధరలు! ఈ రెండు సక్రమంగా రైతుకు అందితే చాలు.