ఏపీ ప్రభుత్వ బటన్ రాజ్‌లో అత్యంత కీలకమైన బటన్లు నొక్కడంలోనూ విఫలమవుతున్నారు. ఇటీవల బటన్లు తప్పనిసరిగా నొక్కుతున్నారు కానీ నిధులు జమ కావడం లేదు. గత నెలల్లో డ్వాక్రామహిళల రుణమాఫీ పేరుతో నొక్కిన బటన్‌లో సగం డబ్బులు ఇంకా జమ కాలేదని గగ్గోలు పెడుతున్నారు. మరో నెల తిరిగేసరికి.. నొక్కాల్సిన బటన్లు వచ్చి వపడ్డాయి. ఇప్పుడు ఆ బటన్ల గురించి .. వాటికి అవసరమయ్యే నిధుల గురించి విస్తృత చర్చ జరుగుతోంది.
ఈ మే నెలలో మొదటి వారం అయిపోయింది. ఇంకా జీతాలు, పెన్షన్ల బిల్లులు క్లియర్ కాలేదు. ఆర్బీఐలో నాలుగు వేల కోట్ల వరకూ ఓడీ, వేస్ అండ్ మీన్స్ అప్పు ఉంది. మంగళవారంఅప్పుతో క్లియర్ చేసుకుంటారు. మళ్లీ ఓడీ తీసుకుంటారు. అయితే ఈ నెలలో నొక్కాల్సిన బటన్లు చాలా ఉన్నాయి. రైతు భరోసా పేరుతో మేనిఫెస్టోలో ఒకే విడతలో రూ. పన్నెండున్నర వేలు ఇస్తామన్న హామీలో… సగాన్ని తగ్గించేసి.. ఇస్తున్న మొత్తానికి ఈ నెలలోనేమీట నొక్కాలి. దీనికి కనీసం ఐదారు వేల కోట్లు కావాలి. ఇక పంటల బీమాను కూడా ఈ నెలలోనే ఇవ్వాలి. పంట నష్టం వేల కోట్లలోనే ఉంది. అలాగే ఫీజు రీఎంబర్స్ మెంట్ మొదటి విడత కూడా ఈ నెలలోనే ఉన్నారు. అసలు గత ఏడాది మొత్తం మీద మూడు త్రైమాసికాలకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. అలాగే ఈ నెలలో మత్స్యకార భరోసాకు కూడా మీట నొక్కాల్సి ఉంది.
ఇవాళ కాకపోతే రేపైనా మీట నొక్కవచ్చని గతంలో ప్రభుత్వం లెక్కలు వేసుకునేది. ఎక్కడెక్కడ విలువైన భూములు తాకట్టు పెట్టి అయినా బేవరేజెస్ కార్పొరేషన్ ను తాకట్టు పెట్టి అయినారుణాలు తెచ్చి మీటలు నొక్కేవారు. కానీ ఈ సారి బ్యాంకులు వెనుకడుగు వేస్తున్నాయి. కేంద్రం మాత్రం ఉదారంగా అప్పులు ఇస్తోంది. అయితే ఎంత కాలం ఇస్తుందనేది ఇప్పుడు కీలకం. ఈ నెలలో కనీసం పది వేల కోట్లకుపైగా అదనపు అప్పులు తెచ్చుకోకపోతే మీటలు నొక్కలేరు. మీటలు నొక్కలేకపోతే.. జనం దేంతో మెత్తుతారో చెప్పడం కష్టమని వైసీపీ నేతలూ బాధపడుతున్నారు.