జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం వ్యవహారం వైసీపీలో కలకలం రేపుతోంది. ఈ అంశంపై బొత్స సత్యనారాయణ విచిత్రంగా స్పందించారు. విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణల్ని తాము ఖండించడం లేదన్నారు. అలాగని సమర్థించడం లేదని అంటున్నారు. సాధారణంగా వైసీపీ నేతలు తమ హయాంలో ఎలాంటి స్కాములు జరగలేదని వాదిస్తారు. అయితే బొత్స మాత్రం రాజ్ కసిరెడ్డి స్కాం చేశాడన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లుగా మాట్లాడారు. ఆయన తీరు చూస్తూంటే మద్యం స్కాం జరిగి ఉంటే అది రాజ్ కసిరెడ్డి వల్లేనని ఇతరులకేం సంబంధం లేదని వాదించేందుకు గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నట్లుగా తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఐటీ సలహాదారుగా జగన్ .. రాజ్ కసిరెడ్డిని నియమించారు. కానీ ఆయన మనీ లాండరింగ్ నిపుణుడు. అందుకే జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉంటారని చెబుతారు. ఐటీ సలహాదారుగా చేసిందేమీ లేకపోయినా మద్యం వ్యాపారాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు. పేరుకు ప్రభుత్వం కానీ.. మొత్తం అధీకృతదారు రాజ్ కసిరెడ్డి. కేవలం నగదు లావాదేవీలు నిర్వహించడం వెనుక ఉన్నప్లాన్ కూడా రాజ్ కసిరెడ్డికే తెలుసు. అయితే ఆయన కమిషన్లు తీసుకున్నా అంతిమ లబ్ది మాత్రం జగన్మోహన్ రెడ్డికేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇప్పుడు అంతా బయటపడే పరిస్థితి రావడంతో రాజ్ కసిరెడ్డిని మాత్రమే బలి చేసి జగన్ ను బయటపడేసే వ్యూహాన్ని అందరూ కలిసి అమలు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విజయసాయిరెడ్డి జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలను చాలా మంది విశ్వసించడం లేదు. ఆయనను కాపాడేందుకే విక్రాంత్ రెడ్డి, రాజ్ కసిరెడ్డిల గురించి చెప్పారని నమ్ముతున్నారు. దానికి తగ్గట్లుగానే బొత్స లాంటి వాళ్లు మాట్లాడుతున్నారు. అయితే ఇలాంటి చీప్ పాలిట్రిక్స్ తో జగన్ ను కాపాడగలరా అన్నదే అసలు డౌట్.