ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎట్టకేలకు సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు రాజ్ కసిరెడ్డి. ఇప్పటికే విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నాలుగుసార్లు నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. ఆయన మాత్రం అరెస్ట్ భయంతో అజ్ఞాతంలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే రాజ్ కసిరెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై సిట్ అధికారులు కౌంటర్ దాఖలు చేయాలని కోరుతూ హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై జడ్జిమెంట్ పెండింగ్ లో ఉనప్పటికీ అనూహ్యంగా రాజ్ కసిరెడ్డి సిట్ నోటీసులపై స్పందించారు. మంగళవారం మధ్యాహ్నం 12గంటలకు విచారణకు హాజరు అవుతానని తన తండ్రి ద్వారా సిట్ అధికారులకు సమాచారం అందించారు. ముందస్తు బెయిల్పై తీర్పు వచ్చేసరికి ఆలస్యం అవుతుందని, అందుకే సిట్ విచారణకు హాజరు అవుతానని పేర్కొన్నారు.
ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డితోపాటు ఎంపీ మిథున్ రెడ్డి విచారణకు హాజరు అయ్యారు. మంగళవారం తాను కూడా విచారణకు హాజరు అవుతానని రాజ్ కసిరెడ్డి ప్రకటించడంతో ఏదో జరగబోతుంది అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ సిట్ విచారణకు రాజ్ కసిరెడ్డి హాజరు అవుతానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. కసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్ లో ఉండటంతో అరెస్ట్ చేయరని విచారణకు హాజరు అవుతున్నట్లు ప్రకటించారా? లేదంటే, సిట్ విచారణలో తనను టార్గెట్ చేస్తూ విజయసాయిరెడ్డి సమాధానాలు ఇవ్వడంతో వాటిని తేల్చేందుకు విచారణకు హాజరు కాబోతున్నారా? అనేది ఉత్కంఠ రేపుతోంది.