ఏపీ లిక్కర్ స్కామ్ లో విజయసాయి రెడ్డి – రాజ్ కసిరెడ్డిల మధ్య దొంగా, పోలీసాట నడుస్తున్నట్లు కనిపిస్తోంది. శుక్రవారం సిట్ విచారణకు హాజరైన తర్వాత ఈ కేసులో రాజ్ కసిరెడ్డినే సూత్రధారి అని , అన్నీ ఆయనకే తెలుసునని విజయసాయిరెడ్డి చెప్పారు. కసిరెడ్డి ఓ తెలివైన క్రిమినల్ అని , పార్టీలో ఎంతో ప్రోత్సహిస్తే తననే మోసం చేశారని చెప్పారు. కట్ చేస్తే.. తాజాగా విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇస్తూ కసిరెడ్డి ఓ ఆడియోను రిలీజ్ చేశారు.
లిక్కర్ స్కామ్ కేసులో తనపై అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. తాను ఇంట్లో లేని సమయంలో సిట్ అధికారులు ఇంటికి , ఆఫీసుకు వచ్చి నోటీసులు ఇచ్చారన్నారు. విచారణకు హాజరు కావాల్సి వస్తుందని ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయినా తనపై బురద జల్లుతున్నారని విడుదల చేసిన ఆడియోలో కవరింగ్ కోసం చెప్పుకొచ్చారు.
తనపై విజయసాయి చేసిన ఆరోపణలపై స్పందిస్తా… నా న్యాయ పోరాటం పూర్తైన తర్వాత మీడియాను పిలిచి ఆయన చరిత్రను అంతా బయటపెడుతానని అన్నారు రాజ్ కసిరెడ్డి. విజయసాయిరెడ్డి బండారం బయటపెడుతానని కసిరెడ్డి చెప్పడం ఏమిటో కానీ, ఈ ఎపిసోడ్ లో దొంగ ఎవరంటే ఇద్దరూ నువ్వంటే , నువ్వేనని ఆరోపించుకున్నట్లుగా ఉంది.
విజయసాయిరెడ్డి చరిత్రను బయటపెడుతానని కసిరెడ్డి అంటున్నారంటే..లిక్కర్ స్కామ్ లో ఆయన పాత్ర కూడా ఉందని చెప్పబోతున్నారా? అనేది ఆసక్తి రేపుతోంది. విజయసాయి రెడ్డి మాత్రం ఈ స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. అన్నీ రాజ్ కసిరెడ్డికే తెలుసునని సిట్ కు చెప్పారు.
ఒకవేళ ఈ లిక్కర్ స్కామ్ కాకుండా వేరే విషయాల్లో విజయసాయిరెడ్డి పాత్ర ఉందంటే.. అందులో జగన్ హస్తం కూడా ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆ విషయాలను కసిరెడ్డి బయటపెట్టే అవకాశం ఎంతమాత్రం లేదు. దీంతో ఈ వ్యవహారంలో విజయసాయి – కసిరెడ్డి మధ్య పోలీసు – దొంగాట నడుస్తోందని అంటున్నారు.