శతమానం భవతి లో హీరో పాత్ర కోసం దిల్ రాజు చాలా చాలా అన్వేషించాడు. ముందు రాజ్ తరుణ్ అనుకొన్నారు. ఆ తరవాత సాయిధరమ్ దగ్గరకు వెళ్లిందీ సినిమా. ఒక దశలో నాని అయితే ఎలా ఉంటుందా?? అనిపించింది కూడా. చివరికి శర్వానంద్ కి చిక్కింది. శతమానం ఓ ఫీల్ గుడ్ మూవీ! అందులో హీరో చేసిందేం ఉండదు. జస్ట్ తనదీ రాముడు మంచి బాలుడు లాంటి క్యారెక్టర్ అంతే. హీరోయిజం చూపించాలనో, మాస్‌కి దగ్గరవ్వాలనో ఆశపడుతున్న రాజ్ తరుణ్, సాయిధరమ్ లాంటి వాళ్లకు ఏమాత్రం నప్పని కథ ఇది. అందుకే వాళ్లిద్దరూ తెలివిగా డ్రాప్ అయ్యారు. నాని కూడా ఈ సినిమా చేయడానికి ఎలాంటి ఆసక్తి చూపించలేదు. చివరికి శర్వా చేతికి చిక్కింది.
శర్వానంద్ కూడా ఈ కథ విని చాలా తటపటాయించాడు. ‘చేయాలా, వద్దా’ అనే డిస్కర్షన్స్తోనే రెండు నెలలు పక్కన పెట్టేశాడు కూడా. కేవలం దిల్‌రాజు జడ్జిమెంట్ పై నమ్మకం, ఆ బ్యానర్ వాల్యూ చూసి ఈ కథకి ఓకే చెప్పాడు శర్వా. రాజు పాత్రకు ఎంత చేయాలో అంతే చేశాడు. ఎక్కడా ఎగస్ట్రాలకు పోకుండా, హీరోలా కాకుండా ఓ క్యారెక్టర్లా బిహేవ్ చేశాడు. మరోసారి ఫీల్ గుడ్ పాత్రలకు తాను నూటికి నూరు పాళ్లూ న్యాయం చేయగలనని నిరూపించుకొన్నాడు. అయితే.. శర్వాకి ఈ సినిమా ద్వారా కొత్తగా ఒరిగేదేం ఉండకపోవొచ్చు. కాస్తో కూస్తో పేరొస్తే గ్లామర్‌గా కనిపించిన అనుపమకు, దర్శకుడికీ దక్కుతుంది. లేదంటే ఎప్పటిలా క్రెడిట్ అంతా తన ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి దిల్‌రాజు సిద్ధంగానే ఉన్నాడు. ఈ హిట్టు చూపించి పారితోషికం పెంచుకోవడానికి గానీ, తన ఇమేజ్‌ని, తనలోని నటుడ్ని కొత్త దారిలో నడిపించుకోవడానికి గానీ శర్వాకి ఎలాంటి అవకాశం లేదు. మాస్ సినిమా కనీసం యావరేజ్ అయినా హీరో రేంజు ఎక్కడికో వెళ్లిపోతుంటుంది. అదే ఫీల్ గుడ్ సినిమా హిట్టయినా.. ఆ క్రెడిట్ చాలామందికి పంచాల్సి ఉంటుంది. బహుశా ఇవన్నీ గమనించే సాయిధరమ్, రాజ్ తరుణ్ తప్పుకొని ఉంటారు. శర్వామాత్రం దొరికిపోయాడు.