రాజ్‌తరుణ్ కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ లాంటి సినిమాలకు అదే బలం అయ్యింది. అయితే ఆ తరవాత రాజ్ తరుణ్ రకరకాల జోనర్లు ప్రయత్నించాడు. పూర్తి స్థాయి ఎంటర్టైనర్లలో కనిపించలేదు. `అనుభవించురాజా` తో మళ్లీ తన కామెడీ టైమింగ్ ని నమ్ముకున్నాడనిపిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్వీసీ (ఎల్.ఎల్.పీ) సంస్థలు సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది, శ్రీను గవిరెడ్డి దర్శకుడు. ఈరోజు రామ్ చరణ్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదలైంది.
అనుభవించు రాజా… భీమవరం బుల్లోడి కథ. భీమవరం అనగానే మనకు సంక్రాంతి, సంక్రాంతి అనగానే కోడిపందాలు గుర్తొస్తాయి. ఇది అచ్చంగా అలాంటి పందాల రాయుడి కథే. కోడి పందాలు, పేకాట, బెట్టింగ్ – ఇదే జీవితంగా గడిపేసే ఓ కుర్రాడి అల్లరి… అనుభవించురాజా. ”అయినా బంగారం గాడు ఊర్లోనీ, ఆడి పుంజు బరిలోనీ ఉండగా, ఇంకో పుంజు గెలవడం కష్టమెహె..” అనే డైలాగ్ తో పూల రంగడు గెటప్ లో… రాజ్ తరుణ్ ఎంట్రీ ఇచ్చాడు. రాజ్ తరుణ్ బాడీ లాంగ్వేజ్ కి తగినట్టే, క్యారెక్టరైజేషన్ కుదిరింది. గోదారి జిల్లా వాళ్ల ఎటకారం, అక్కడి నేటివిటీ.. టీజర్ లో కనిపించింది. ”తిప్పే కొద్దీ తిరగడానికి అదేమైనా ఫ్యాను స్పీడేంట్రా… ఉన్న నాలుగు ఎంట్రుకలూ ఊడిపోతాయ్” అంటూ రాజ్ తరుణ్పైనే ఓ పంచ్ పడింది.
”నీ బాధ నాకర్థమైంది.. నువ్వు గెలిచి నా పరువు కాపాడితే.. సాయింత్రం నీ గంప కింద నాలుగు పెట్టలు పెడతా” అంటూ కోడి పుంజుని బుజ్జగించిన స్టైల్ చూస్తుంటే – కచ్చితంగా ఈ సినిమా ఫన్ రైడ్ లా సాగుతుందనిపిస్తోంది. షూటింగ్ పూర్తయిన `అనుభవించురాజా` ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. త్వరలోనే విడుదల చేస్తారు.