ఈ సంక్రాంతికి పుంజులు రెండే అనుకుంటున్న తరుణంలో.. మరో కోడినీ పందెంలోకి దింపుతున్నాడు నాగార్జున. అజ్ఞాతవాసి, జై సింహా ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి. పండక్కి ఈ రెండు సినిమాలే అనుకుంటే.. ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా రంగంలోకి దిగాడు. తను కథానాయకుడిగా నటించిన రంగులరాట్నంని సంక్రాంతికే విడుదల చేయనున్నారు. పవన్, బాలయ్య సినిమాలతో పోటీ పడడం తప్పు కాదు. సంక్రాంతికి మరో సినిమాకీ అవకాశం ఉంది. కాకపోతే ఇంత హడావుడి ఎందుకు? అనేదే. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్లు మొదలవ్వలేదు. టీజర్ గానీ, పాట గానీ బయటకు రాలేదు. ఇప్పుడు మొదలెట్టినా చేతిలో ఉన్నది పది హేను రోజులే. ఇంతలో పవన్, బాలయ్య సినిమాలకు ధీటుగా ప్రమోషన్లు చేయగలరా? అనే అనుమానాలున్నాయి.
మంచి సినిమా చేశాం అనుకున్నప్పుడు విడుదల విషయంలో ఇంత కంగారు పడడం ఎందుకు.? ‘నాకు అన్ని విధాలా నచ్చినప్పుడే విడుదల చేస్తా’ అనేది నాగార్జున తరచూ చెప్పేమాట. అలాంటి నాగ్… ఈ సినిమా విషయంలో ఎందుకు ఇంత త్వరపడుతున్నాడు. సంక్రాంతి సీజన్ మిస్ చేయకూడదనా? లేదంటే… ఈ సినిమాని ఇప్పుడు విడుదల చేస్తేనే తప్ప డబ్బులు చేసుకోలేమనా?? గతేడాది సంక్రాంతికి శతమానం భవతి విడుదలై విజయం సాధించిందీ అంటే.. అందులో దిల్ రాజు వ్యూహం కూడా ఉంది. ఎప్పటి నుంచో సంక్రాంతికి వస్తున్నాం.. అంటూ గట్టిగా ప్రచారం చేసుకుంటూ వచ్చాడు. అన్నట్టుగానే సంక్రాంతికి విడుదల చేశాడు. రాజ్ తరుణ్ సినిమా విషయంలో ఇలాంటివేం జరగలేదు. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో?