దర్శకుడవ్వాలనుకుని వచ్చి – అనుకోకుండా హీరో అయిపోయిన వాడు రాజ్ తరుణ్. అదే తనకు బాగా కలిసొచ్చింది. ఉయ్యాల జంపాలా, కుమారి 21 ఎఫ్, సినిమా చూపిస్త మావ.. ఇలా హ్యాట్రిక్ సినిమాలతో రెచ్చిపోయాడు. అయితే ఆ తరవాత సరైన హిట్లు లేవు. కాకపోతే.. తన చేతిలో సినిమాలకు కొదవ లేదు. తాజాగా.. `పవర్ ప్లే` కోసం జోనర్ కూడా మార్చాడు. తొలిసారి ఓ థ్రిల్లర్ కథ ఎంచుకున్నాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా రాజ్ తరుణ్ తో చిట్ చాట్.
* ఎప్పుడూ లేనిది కొత్త జోనర్ ట్రై చేసినట్టున్నారు?
– అవునండీ. ఇప్పటి వరకూ నేను గానీ, దర్శకుడు గానీ, మధునంద్, ధన్‌రాజ్… ఇలా ఈ సినిమాలో కనిపించే ఎవ్వరైనా సరే, టచ్ చేయని జోనర్ ఇది. లాక్ డౌన్ అయిపోయాక.. మేమంతా కలిసి మాట్లాడుకున్నాం. ఎలాంటి సినిమా చేయాలి… అని బాగా చర్చించాం. ఆ సమయంలో నాలుగైదు ఐడియాలు వచ్చాయి. వాటిలో ది బెస్ట్ ఐడియా ఎంచుకుని ఈ సినిమా తీశాం.
* ఈ మధ్య ఫ్లాపులొచ్చాయని జోనర్ మార్చారా?
– అలాగని కాదు. ఏ సినిమా మొదలెట్టినా హిట్టు కొట్టాలనే అనుకుంటాం. కొన్నిసార్లు మనం అనుకున్నది జరుగుతుంది. కొన్నిసార్లు జరగదు. తప్పులు చేయడం చాలా సహజం. అయితే చేసిన తప్పుల్ని పునరావృతం చేయకూడదు. నా వరకూ చేసిన తప్పుల్ని రిపీట్ చేయనివ్వను. కొత్త తప్పులు చేస్తానేమో అంతే. తప్పులు చేసుకుంటూ వెళ్తేనే నేర్చుకుంటాం. ఈ జోనర్ మా అందిరికీ కొత్త. మేకింగ్ కూడా కొత్తగా ఉంటుంది. కెమెరామెన్ ఆండ్రూ సైతం.. ఇలాంటి థ్రిల్లర్ ఎప్పుడూ చేయలేదు. ఇక నా పాత్ర అంటారా? ఇంతకు ముందు చేసిన రోల్స్‌కీ, దీనికీ చాలా తేడా ఉంటుంది.
* పవర్ ప్లే అనే టైటిల్ పెట్టడానికి కారణం?
– పవర్లో ఉన్న కొంత మంది వ్యక్తుల వల్ల ఓ సామాన్యుడు ఎలా బలైపోయాడు? అందులోంచి ఎలా బయటకు వచ్చాడు? అన్నది కాన్సెప్ట్. `పవర్ ప్లే`అనేది అందరికీ తెలిసిన పదం. క్రికెట్‌తో అందరికీ సుపరిచితమైంది. మాకథకీ అదే మంచి టైటిల్ అనిపించింది.
* ఇలాంటి పాత్ర చేయడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు?
– నటుడిగా ఎలాంటి పాత్ర వచ్చినా చేయాలి. సినిమా మొత్తం సీరియస్ గా కనిపిస్తా. చివరి వరకూ పరిగెడుతూనే ఉంటా. అయితే సెట్లో కట్ చెప్పాక మాత్రం సరదాగా మారిపోతా. కథకినిజాయతీగా ఉండాలి అనిపించింది. అందుకే అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు పాటించాం. ఎక్కడా పాటలు ఇరికించలేదు. కామెడీ సీన్లు పెట్టలేదు.
* మైండ్ గేమ్ తో ప్లే అయ్యే కథా?
– మైండ్ గేమ్.. కాదు.. కొంతమంది కొన్ని జీవితాలతో ఆడుకోవాలని చూస్తారు. అలాంటి కథ ఇది.
* ఈ సినిమాతో మీ ఇమేజ్ మారుతుంది అనుకుంటున్నారా?
– నాకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ అయ్యిందో లేదో నాకు తెలీదు, కథ బాగా నచ్చింది. ఈ సినిమాతో నా ఇమేజ్ మారిపోవాలనో, నా దగ్గరకు వచ్చే కథలు మారిపోవాలనో అనుకోలేదు. కథకి సరెండర్ అయిపోయి నటించానంతే. వేరే విషయాలు నేనేం ఆలోచించను.
* ఈమధ్య వరుసగా ఫ్లాపులొచ్చాయి? తప్పెక్కడ జరిగిందనుకుంటున్నారు?
– నా సినిమా షూటింగ్ అయిపోతే.. ఆ సినిమా నుంచి డిస్కనెక్ట్ అవుతా. చేసినంత సేపూ.. మనసా వాచా కర్మణా పనిచేస్తా. అయిపోయాక.. ఆ సినిమా గురించి ఆలోచించను. రిజల్ట్ నా చేతుల్లో ఉండదు. జనాల చేతుల్లోకి వెళ్లిపోతుంది. అలాంటప్పుడు ఎంత ఆలోచించినా అనవసరమే. ఓ సినిమాకి 200 మంది పనిచేస్తారు. 24 క్రాఫ్ట్స్ పనిచేస్తాయి. ఎక్కడైనా తప్పు జరగొచ్చు. ఒకరి పేరు చెప్పి, తప్పంతా వాళ్లపై నెట్టడం నాకు ఇష్టం ఉండదు. సినిమా ఆడకపోతే.. నాది మాత్రమే కాదు. అందరి జీవితాలూ ఎఫెక్ట్ అవుతాయి. రచయితలు, దర్శకులైతే.. రెండేళ్ల పాటు కష్టపడతారు. ఆ కష్టం అంతా వృథా అవుతుంది.
* సినిమా చేస్తున్నప్పుడు మీ ఇన్పుట్స్ ఏమైనా ఇస్తుంటారా?
– తప్పకుండా ఇస్తాను. వాళ్లు వింటారా? లేదా? అనేది వాళ్ల ఇష్టం. నేను ఎవరితో సినిమా చేసినా.. వాళ్లని ముందు స్నేహితులుగా మార్చుకుంటా. అప్పుడే నా అభిప్రాయాల్ని పంచుకునే స్వేచ్ఛ వస్తుంది.
* చేసిన దర్శకులతో మళ్లీ మళ్లీ పని చేస్తుంటారు? కారణమేంటి?
– నేనేం ప్లాన్ చేసుకోను. అది అలా కుదిరింది. ఆ కంఫర్ట్ లెవెల్ ఉన్నప్పుడు కలిసి చేయడంలో తప్పేం ఉండదు. నా గురించి బాగా తెలిసినవాళ్లకు నాకేం కావాలో నేను చెప్పాల్సిన పనిలేదు. వాళ్లకు అర్థమైపోతుంది. వాళ్లకేంకావాలో.. నాకు అర్థమైపోతుంది. అందుకే పని సులభం అవుతుంది. మంచి దర్శకుడైతే ఎలాంటి కథైనా ఏదైనా హ్యాండిల్ చేయగలుగుతాడు. ఆ విషయంలో నాకు ఎలాంటి అపనమ్మకాలు లేవు.
* ఒరేయ్ బుజ్జిగా ఓటీటీలో విడుదలైంది. ఆ విషయంలో అసంతృప్తి ఉందా?
– ఆ సినిమా థియేటర్లో వచ్చుంటే బాగుండేది. పది మంది నవ్వుతున్నామంటే… మనం ఇంకా ఎక్కువ నవ్వుతాం. కామెడీ సినిమా అలానే చూడాలి. అయితే ఓటీటీలో విడుదలైందన్న నిరుత్సాహం లేదు. ఆ సమయంలో అంతకంటే గొప్ప ఆప్షన్ మా కంటికి కనిపించలేదు. ఈ సినిమా ఓటీటీకి బాగుంటుంది, ఈసినిమా థియేటర్లో బాగుంటుంది అని రూలేం లేదు. సినిమా బాగుంటే ఎక్కడైనా చూస్తారు. కాకపోతే థియేటరికల్ ఎక్స్పీరియన్స్ ఓటీటీకంటే బాగుంటుంది. ఇంట్లో కూర్చుని సినిమా చూస్తుంటే, ఒకేసారి పది పనులు పెట్టుకుంటాం. థియేటర్లో అలా ఉండదు. మనసంతా సినిమాపైనే ఉంటుంది.