రాజ్ తరుణ్ ది లవర్ బోయ్ ఇమేజ్. ఇప్పటి వరకూ ఎంటర్టైన్మెంట్ పంచే సినిమాలే చేశాడు. తెరపై నవ్వించాడు. అయితే… థ్రిల్లర్ జోనర్ ఇప్పటి వరకూ ముట్టుకోలేదు. విజయ్ కుమార్ కొండా కూడా అంతే. `గుండె జారి గల్లంతయ్యిందే` లాంటి సూపర్ లవ్ స్టోరీతో ఎంట్రీ ఇచ్చాడు. తీసిన వన్నీ… ప్రేమ కథలే. ఇప్పుడు తను కూడా థ్రిల్లర్ బాట పట్టాడు. వీరిద్దరి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న సినిమా `పవర్ ప్లే`. `ఒరేయ్ బుజ్జిగా` విడుదలైన వెంటనే ఈ సినిమాని పట్టాలెక్కించారు. ఎప్పుడు మొదలైందో, ఎప్పుడు పూర్తయ్యిందో తెలిసేంత లోపే… ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల చేసేశారు.
సాధారణంగా ట్రైలర్లో ఒకట్రెండు డైలాగులైనా ఉంటాయి. కొన్ని ట్రైలర్ల నిండా డైలాగులే. కానీ… `పవర్ ప్లే`లో మాత్రం ఒక్క డైలాగూ కనిపించలేదు. అంతా యాక్షనే. ఉరుకులు, పరుగులు, పోలీస్ సైరన్లు, యాక్సిడెంట్లు, స్కెచ్చులూ.. ఇలా ఒకటేమిటి.. అన్నీ చూపించేశారు. రాజ్ తరుణ్ లుక్ కూడా కొత్తగానే ఉంది. సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్.. ఇవన్నీ ఓ థ్రిల్లర్ సినిమాకు కావల్సినంత సపోర్ట్ ఇచ్చాయి. దానికి బోనస్ గా.. ఓ లిప్ లాక్ షాట్ కూడా. చక చక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మంచి రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తోంది.