హైదరాబాద్: సల్మాన్ ఖాన్‌కు బుర్రలేదంటూ అతని చిరకాల మిత్రుడు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీ అధినేత రాజ్ థాకరే చీవాట్లు పెట్టారు. యాకూబ్ మెమన్ విషయంలో సల్మాన్ చేసిన ట్వీట్లగురించి రాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సల్మాన్ న్యూస్ పేపర్లు చదవడని, చట్టంగురించి తెలియదని, అందుకే యాకూబ్‌కు అనుకూలంగా ట్వీట్లు చేసుకుంటూ పోయాడని అన్నారు. సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ గౌరవప్రదమైన వ్యక్తి అని చెప్పారు. యాకూబ్‌కు క్షమాభిక్ష పెట్టాలని కొందరు రాష్ట్రపతికి లేఖలు రాశారని, సుప్రీమ్ కోర్టు ఆదేశాలను ఎవరైనా ఎలా ప్రశ్నిస్తారని రాజ్ అన్నారు. యాకూబ్ ఉరి విషయంలో బీజేపీ ప్రభుత్వమూ పెద్ద డ్రామా ఆడిందని, దేశంలో అల్లర్లు జరిగి ప్రజలలో కలహాలు పెరగాలనే బీజేపీ కోరుకుంటోందని రాజ్ వ్యాఖ్యానించారు.
యాకూబ్‌కు ఉరిశిక్ష అమలుచేసేముందు సల్మాన్ అది అన్యాయమని ట్వీట్ చేయటం, దానిపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో ఉపసంహరించుకోవటం తెలిసిందే. మరోవైపు, శివసేననుంచి విడిపోయి మహారాష్ట్ర నవనిర్మాణసేన పార్టీని స్థాపించిన రాజ్ థాకరేకు, సల్మాన్‌కు మధ్య ఎంతోకాలంగా సత్సంబంధాలు ఉన్నాయి. హిట్ అండ్ రన్ కేసులో గత మే నెలలో ఐదేళ్ళు శిక్ష పడినపుడు రాజ్ థాకరే సల్మాన్‌ను, అతని కుటుంబసభ్యులను ఇంటికి వెళ్ళి ఓదార్చారు.