మారుతి టీమ్ నుంచి వస్తున్న మరో సినిమా ‘భలే ఉన్నాడే’. రాజ్ తరుణ్ హీరోగా నటించాడు. శివ సాయి వర్థన్ దర్శకత్వం వహించారు. ఈరోజే టీజర్ విడుదలైంది. టీజర్ చూస్తే మారుతి సినిమాలు భలే భలే మగాడివోయ్, మహానుభావుడు చిత్రాలు గుర్తొస్తాయి. అలాంటి కథే అని కాదు, హీరో క్యారెక్టరైజేషన్‌తో నడిచిన ఆ రెండు సినిమాలూ బాగా ఆడాయి. ‘భలే ఉన్నాడే’ కూడా క్యారెక్టరైజేషన్ చుట్టూ నడిచే కథే. అమ్మాయిలంటే ఆమడ దూరం ఉండే ఓ అబ్బాయి కథ ఇది. తన వృత్తేమో.. పెళ్లిళ్లకూ, పేరంటాలకూ అమ్మాయిల్ని ముస్తాబు చేయడం. ఇలాంటి ప్రొఫెషన్ కూడా ఉంటుందా? అని సినిమాలోని పాత్రలే ఆశ్చర్యపోయేంత కొత్త ప్రొఫెషన్ సృష్టించారు ఇందులో.
‘మంచం ఎక్కితే తెల్లారే సరికి ముగ్గుర్ని చేతిలో పెట్టాల్సిందే’ అనుకొనే అమ్మాయికి ఈ ‘తేడా’ అబ్బాయి దొరికితే పరిస్థితి ఏమిటన్నది ఫన్నీగా చూపించారు. అసలు హీరో అమ్మాయిల్ని ఎందుకు దూరంగా పెడుతున్నాడు? అతని కథేమిటో తెలియాలంటే.. ‘భలే ఉన్నాడే’ చూడాలి. మేకింగ్ లో క్వాలిటీ కనిపించింది. ఫన్ చేయడానికి బోలెడన్ని పాత్రలున్నాయి. దానికి తోడు ‘మారుతి’ అనే బ్రాండ్ ఇమేజ్ ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్. రాజ్ తరుణ్ కూడా టైటిల్ కి తగ్గట్టుగా అందంగా కనిపిస్తున్నాడు. కాన్సెప్ట్, దానికి తోడు వినోదం సెట్ అయితే.. ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న రోజులు ఇవి. `భలే ఉన్నాడే`లోనూ ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. చూద్దాం.. రాజ్ తరుణ్ ఈసారి హిట్ కొడతాడేమో..?