ఫ్లాపుల్లో ఉన్న హీరోకి దిల్‌రాజు సంస్థలో సినిమా చేసే ఛాన్సొస్తే.. అంతకంటే ఆనందం ఏముంది? ఈసారి ఎలాగైనా హిట్టొచ్చిన తీరుతుందన్న గ్యారెంటీ ఉంటుంది. ఆ నమ్మకంతోనే రాజ్ తరుణ్ ఉండేవాడు. దిల్‌రాజు సంస్థలో రాజ్ తరుణ్ చేసిన రెండో సినిమా.. ‘ఇద్దరి లోకం ఒకటే’. ఈ సినిమా గురించి తరుణ్ ఎప్పుడూ కాన్ఫిడెన్స్‌తోనే మాట్లాడేవాడు. దిల్ రాజు కథల ఎంపికపై నమ్మకం ఉన్నవాళ్లందరికీ… రాజ్ తరుణ్ మాటలు పెద్ద వింతగానూ, విశేషంగానూ అనిపించేవి కావు. ఈసారి రాజ్ తరుణ్ కల నెరవేరుతుందనిపించింది.
దానికి తగ్గట్టుగానే రాజ్ తరుణ్ కూడా తనవంతు త్యాగాలు చేశాడు. ఈ సినిమా కోసం తనేం పారితోషికం తీసుకోలేదు. సినిమా బాగా ఆడితే – అప్పుడు చూద్దాం అని డిసైడ్ అయ్యాడు. నిర్మాతకు అది కలిసొచ్చే వ్యవహారమే. కేవలం నెలకు ఇంత అంటూ ఖర్చుల కోసం కొంత మొత్తం తీసుకునేవాడంతే. తన వ్యక్తిగత సిబ్బందికి జీతాలు కూడా తనే ఇచ్చుకున్నాడు. ఎన్ని కాల్షీట్లు కావాలంటే అన్నీ ఇచ్చాడు. కానీ… ఫలితం ఏమైంది? ఈ సినిమాకి కూడా తొలి ఆట పూర్తవ్వగానే డిజాస్టర్ టాక్ బయటకు వచ్చేసింది. తొలి రోజు థియేటర్లలో జనమే కనిపించలేదు. దిల్‌రాజు సంస్థలో ఇంత నీరసమైన కథ, కథనాలతో సినిమా వస్తుందని ఎవరూ అనుకోలేదు. ఈ సినిమాతో రాజ్ తరుణ్‌కి కొత్తగా పోయేదేం లేదు. కాకపోతే… నమ్ముకున్న సినిమా, పారితోషికం కూడా కాదనుకుని చేసిన సినిమా.. పల్టీకొట్టేసింది. ఇప్పుడు తన ఆశలన్నీ ‘ఒరేయ్ బుజ్జి’పైనే.