షార్ట్ టైమ్ మొమొరీ లాస్‌తో ‘భలే భలే మగాడివోయ్’ వచ్చింది. అతి శుభ్రత అనే కాన్సెప్టుతో ‘మహానుభావుడు’ తీశారు. ఇప్పుడు మరో జబ్బున్న హీరోని తెరపై చూడబోతున్నారు. ‘రాజుగాడు’ సినిమాతో. రాజ్ తరుణ్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. అమైరా దస్తూర్ నాయిక. సంజనారెడ్డి దర్శకురాలిగా పరిచయం అవుతోంది. ఈ సినిమాలో రాజ్ తరుణ్‌కి ఓ వెరైటీ జబ్బు ఉంది. తనకు తెలియకుండానే దొంగతనాలు చేసేస్తుంటాడన్నమాట. ఆఖరికి తన పర్సు తానే కొట్టేసే బాపతు. టీజర్ అంతా హీరో క్యారెక్టరైజేషన్‌ని చూపించడానికే వాడుకున్నారు. సినిమా ఎలా ఉండబోతోందో చూచాయిగా హింట్ ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్, ఫృథ్వీ ఉన్నారు కాబట్టి.. కామెడీకి ఢోకా లేదనుకోవాలి. పైగా పాయింట్ కూడా అలాంటిదే. ఎంత పిండుకుంటే అంత వినోదం పుడుతుంది. హీరోల్లోని లోపాల్ని చూపిస్తూ. సరదాగా నవ్వించిన సినిమాలు బాక్సాఫీసు దగ్గర బాగానే ఆడాయి. చూస్తుంటే… రాజుగాడు కూడా ఆ జాబితాలో చేరబోతున్నట్టే అనిపిస్తోంది.