పేరుకి సాఫ్ట్ వేర్ ఇంజనీర్. కానీ చేసేవన్నీ దొంగతనాలు. పొద్దుట్టే.. నీటుగా ఫ్యాంటూ షర్టూ, టక్కు, టై వేసుకుని వెళ్తాడు. సాయింత్రం అయ్యేసరికి, కిటికీలూ తలుపులూ బద్దలుకొట్టి, తన చోర చాతుర్యం చూపిస్తుంటాడు. పైకి రారాజు. లోలోపలచోరుడు. అందుకే `రాజ రాజ చోర` అయ్యాడు. అతని కథేమిటిలో తెలియాలంటే `రాజ రాజ చోర` చూడాలి. శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రమిది. మేఘా ఆకాష్, సునయిన హీరోయిన్లు. హాసిత్ గోళీ దర్శకత్వం వహించాడు. టీజర్ ఈరోజే విడుదలైంది.
క్రైమ్ కామెడీ జోనర్ లో సాగే సినిమా ఇది. శ్రీ విష్ణు పాత్ర, తన స్వభావం, హావ భావాలూ అన్నీ హిలేరియస్ గా పండాయన్న విషయం.. టీజర్ చూస్తే అర్థమైపోతుంది. `రాజ రాజ చోర`ని పట్టుకుని – పాత కేసులు సైతం తనపై వేసేయాలన్న కుతూహలంతో తిరిగే పోలీస్ అధికారిగా రవిబాబు నటించాడు. టీజర్ కట్ చేసిన విధానం, షాట్లూ.. రొటీన్ కి భిన్నంగానే ఉన్నాయి. వివేక్ సాగర్ నేపథ్యం, ఫొటోగ్రఫీ.. ఇవన్నీ ఈ సినిమాకి ప్లస్ పాయింట్లు. క్రైమ్ కామెడీ జోనర్లో హిట్టు పడి చాలా రోజులైంది. పడితే మాత్రం – ఆ రేంజ్ మామూలుగా ఉండదు. చిన్న సినిమాలకు సైతం బారీ విజయాలు అందించిన జోనర్ ఇది. శ్రీవిష్ణు ఇది వరకు చేసిన `బ్రోచేవారెవరురా` మంచి క్రైమ్ కామెడీ సినిమాగా మిగిలింది. ఆ కోవలో `రాజ రాజ చోర` నిలచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.