Raja Raja Chora Telugu Review
తెలుగు360 రేటింగ్ 2.75/5
శ్రీవిష్ణుది ఓ విభిన్నమైన పంథా. కమర్షియల్ కథల జోలికి వెళ్లడు. కాన్సెప్ట్ ని నమ్ముకుంటాడు. నటుడిగా తనని నిరూపించుకునే పాత్రల కోసం అన్వేషిస్తుంటాడు. ఆ ప్రయాణంలో తనకు మంచి విజయాలు కూడా దక్కుతుంటాయి. బ్రోచేవారెవరురాతో కాన్సెప్ట్ కథల్ని కమర్షియల్ గా ఎలా సక్సెస్ చేసుకోవాలో తెలుసుకున్నాడు. ఇప్పుడు సరిగ్గా అలాంటి కాంబినేషన్ తోనే.. `రాజ రాజ చోర` చేశాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రచారం మొత్తం వైవిధ్యంగా సాగింది. అదే కొత్తదనం… `రాజ రాజ చోర`లో కనిపించిందా? శ్రీ విష్ణు ఎంచుకున్న ఈ కాన్సెప్ట్ మరోసారి కమర్షియల్ గా వర్కవుట్ అయ్యిందా, లేదా?
భాస్కర్ (శ్రీవిష్ణు) ఓ స్టేషనరీ షాప్‌లో పనిచేస్తుంటాడు. బయటికేమో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని చెప్పుకుంటుంటాడు. అతని ప్రేయసి సంజు అలియాస్ సంజన (మేఘ ఆకాష్). ఆమె కూడా సాఫ్ట్వేర్ ఇంజినీరే. ఇద్దరూ కలిసి సొంతంగా ఇల్లు కట్టుకోవాలని… ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనేది ప్లానింగ్. అందుకోసం డబ్బు కూడబెడుతుంటారు. భాస్కర్ని అతని అవసరాలు దొంగగా మార్చేస్తాయి. తన దగ్గరున్న పురాతనమైన రాజు కిరీటం, వస్త్రాలు ధరించి దొంగతనాలు చేస్తే మళ్లీ ఆ అవసరం రాకుండా జీవితంలో స్థిరపడిపోతావని అంజు (గంగవ్వ) చెబుతుంది. ఆ కిరీటం పెట్టుకుని దొంగతనానికి వెళ్లిన భాస్కర్ ఎలాంటి అనుభవం ఎదురైంది? అతని జీవితంలోకి వచ్చిన విద్య (సునైన) ఎవరు? ఆమె కోసం భాస్కర్ ఏం చేశాడు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
యువతరం దర్శకులు కొత్త కోణాల్ని స్పృశిస్తూ కథల్ని సిద్ధం చేస్తున్నారడనంలో ఏమాత్రం సందేహం లేదు. వాటిని నమ్మి భుజాన మోసేందుకు శ్రీవిష్ణులాంటి కథానాయకులు కూడా ఇప్పుడుండటం చిత్రసీమకి కలిసొచ్చే విషయం. ఒక సినిమాకి రచన ఎంత ముఖ్యమో యువ దర్శకులు, కథానాయకులకి బాగా తెలుసు. అందుకు తగ్గట్టే కసరత్తులు చేసుకుని రంగంలోకి దిగుతున్నారు. హసిత్ గోలి కూడా రైటింగ్ టేబుల్‌పైనే బలంగా సినిమాని సిద్ధం చేసుకున్నాడు. ఆ స్థాయిలో సినిమాని తెరపైకి తీసుకొచ్చే క్రమంలో కాస్త తడబడినా మొత్తంగా పర్వాలేదనిపిస్తాడు.
దొంగతనాలు చేసే వాల్మీకి రామాయణం రాసే స్థాయికి ఎలా చేరాడనే చరిత్రని కథలు కథలుగా చెప్పుకుంటాం. అలా ఓ దొంగ పరిణామ క్రమమే ఈ సినిమా. దర్శకుడు మోతాదుకి మించి ఇంటలెక్చువల్ సెన్సిబిలిటీస్‌ని వాడుతూ కథని చెప్పడం సామాన్య ప్రేక్షకుడికి అక్కడక్కడా కాస్త ఇబ్బందిగా అనిపించినా… కథలో ఫన్, క్యారెక్టరైజేషన్స్ మెప్పిస్తాయి. కథ ఆరంభించడానికి బాగా సమయం తీసుకున్నాడు దర్శకుడు. ఆ మాటకొస్తే.. తొలి సగంలో అసలు కథే కనిపించదు. పాత్రల పరిచయం, వాటి పరిణామ క్రమం తప్ప. అయితే… ప్రతీ సన్నివేశంలోనూ కామెడీ టచ్ ఉంటుంది. మరీ విరగబడి నవ్వేయలేం కానీ.. ఆయా సన్నివేశాలు సరదాగా సాగుతూ.. జోష్ ఇస్తాయి. ఇంట్రవెల్ బ్యాంగ్ మాత్రం అదిరిపోతుంది. భాస్కర్, సంజన మధ్య వచ్చే సన్నివేశాలు… రాజు దొంగ అవతరారంలో శ్రీవిష్ణు, స్నేహితుడి ఇంట్లో రవిబాబు పట్టుబడే సన్నివేశాలు ద్వితీయార్థంపై మరిన్ని అంచనాలు పెంచుతాయి.
కానీ ద్వితీయార్థంలో కథ మళ్లీ నెమ్మదిస్తుంది. ఇంట్రవెల్ బ్యాంగ్ ఎంత జోష్ గా ఉంటుందో, ద్వితీయార్థంలో తొలి సన్నివేశమే అంత చప్పగా మొదలెట్టి, ఈ సినిమాపై పెంచుకున్న అంచనాల్ని.. తగ్గించేస్తాడు దర్శకుడు. తొలి సగభాగంలో హాస్యంపై పట్టు ప్రదర్శించిన దర్శకుడు ద్వితీయార్థంలో డ్రామాపైనే ప్రధానంగా దృష్టిపెట్టాడు. కొన్ని సన్నివేశాల్లో ఎమోషన్స్ పండినా… తొలి సగభాగం స్థాయి ఫీల్ మాత్రం పండదు. ప్రవచనాలతో ముడిపెడుతూ పతాక సన్నివేశాలు తీర్చిదిద్దిన తీరు కొత్తగా అనిపిస్తుంది. కానీ ఆ సన్నివేశాల్లో వేగం తగ్గడంతోపాటు, సామాన్య ప్రేక్షకుడికి అర్థం కాని రీతిలో గందరగోళంగా అనిపిస్తాయి. ప్రతీ పాత్రకూ ఓ జస్టిఫికేషన్ ఇవ్వాలనుకోవడంలో తప్పు లేదు. కానీ… ఆ ప్రయత్నంలో కథని సాగదీసి, ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించకూడదు. ఇక్కడ అదే జరిగింది. ఓ కామెడీ ఫీల్ తో మొదలైన సినిమా.. భారంగా ముగిసినట్టు అనిపిస్తుంది. తాను చెప్పదలచుకున్న పాయింట్ నే వినోదాత్మకపూత పూసి ముగించాల్సింది.
నటన పరంగా శ్రీవిష్ణు మరోసారి ప్రేక్షకుల మనసు దోచేశాడు. `మెథడ్ యాక్టింగ్ చేస్తున్నాడు చూడు` అనే రవిబాబు డైలాగ్లకి తగ్గట్టుగానే శ్రీవిష్ణు తన పాత్రలో ఒదిగిపోయాడు. ఫ్యామిలీ మేన్‌గా… ఓ ప్రేమికుడిగా కనిపిస్తూ భావోద్వేగాల్ని పండించిన తీరు మెప్పిస్తుంది. మేఘ ఆకాష్, సునైన… నవతరం కథానాయికలకి సాహసం చేయని ఓ కొత్త రకమైన పాత్రల్లో కనిపిస్తారు. ఇద్దరి పాత్రల్లోనూ బలం ఉంది. అందులో వాళ్ల అభినయం కూడా ఆకట్టుకుంటుంది. రవిబాబు, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్, గంగవ్వ పాత్రలు కూడా కథలో కీలకం. ఆ పాత్రలతోనూ ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. టెక్నికల్ టీమ్ కూడా మంచి పనితీరుని కనబరిచింది. కెమెరా, సంగీతం విభాగాలు కథకి ప్రాణం పోశాయి. దర్శకుడు రాసుకున్న కథ, సంభాషణలు బాగున్నాయి.
ఓటీటీల్లో కంటెంట్‌ని చూస్తూ పొరుగు భాషల్లో కథల గురించి మాట్లాడుకుంటుంటామని, అలా ఈ సినిమా తర్వాత మన గురించి కూడా మాట్లాడుకుంటారని శ్రీవిష్ణు విడుదలకి ముందు ఇంటర్వ్వూల్లో చెప్పాడు. అది ముమ్మాటికీ నిజమే. కాకపోతే ఓటీటీల్లో నెమ్మదిగా ఒకటికి రెండుసార్లు సినిమాని చూసుకునే వీలుంటుంది. కానీ థియటేర్లలో మాత్రం ప్రేక్షకుడిని తొలిసారి చూసినప్పుడే ఇంప్రెస్ చేయాలి. మళ్లీ మళ్లీ థియేటర్‌కి వచ్చేంత స్టఫ్ ఉందనిపించాలి. అప్పుడే బాక్సాఫీసు దగ్గర నిలబడుతుంది. థియేటర్ నుంచి బయటికొచ్చిన ప్రేక్షకుడు ఓటీటీలో చూసుకోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తేనే చిక్కులు. మొత్తంగా పర్వాలేదనిపించే సినిమా ఇది.
ఫినిషింగ్ టచ్: అందరూ దొంగలే
తెలుగు360 రేటింగ్ 2.75/5