2025లో భారీ సినిమాలు మోత మోగించబోతున్నాయి. అందులో రాజాసాబ్ ఒకటి. ఏప్రిల్ 10న ‘రాజాసాబ్’ రావాల్సివుంది. ప్రభాస్ – మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకొన్న సినిమా ఇది. చిత్రీకరణ పూర్తి కావొచ్చింది. ఏప్రిల్ 10న వస్తామని చిత్రబృందం కూడా ప్రకటించింది. అయితే రాజాసాబ్ రిలీజ్ డేట్ ఇప్పుడు డైలామాలో పడిందని, అనుకొన్న సమయానికి రాకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం లేకపోలేదు. రాజాసాబ్‌కు సంబంధించిన గ్రాఫిక్ వర్క్పెండింగ్ లో ఉంది. ఈ సినిమాలో సీజీకి చాలా ప్రాధాన్యం ఉంది. సీజీతో పెట్టుకొంటే – వర్క్ ఎప్పుడు ఫినిష్ అవుతుందో చెప్పలేం. ఆ భయం ‘రాజాసాబ్’ కూ ఉంది. ఇప్పటికే కొంత భాగం సీజీ వర్క్ అయినా, మేజర్ పార్ట్ బాకీ ఉంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కీలకమైన ఎపిసోడ్స్ సీజీ అవ్వలేదు. దాంతో ఏప్రిల్ 10కి తీసుకురాగలమా, లేదా? అనే డౌట్ చిత్రబృందానికీ ఉంది.
ఒకవేళ ఏప్రిల్ 10న రాజాసాబ్ రాకపోతే, ఆ డేట్ క్యాష్ చేసుకోవాలనుకొంటోంది `విశ్వంభర`. సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇది. `గేమ్ ఛేంజర్` వల్ల వాయిదా పడింది. మే 9న విడుదల చేసే ఆలోచనలో వుంది చిత్రబృందం. అయితే ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. ఫిబ్రవరి నాటికి ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. రాజాసాబ్ రాకపోతే.. ఏప్రిల్ 10న తీసుకురావడానికి ఎలాంటి అభ్యంతరాలూ ఉండవు. అందుకే.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో యూవీ క్రియేషన్స్ టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ రాజాసాబ్ ని వాయిదా వేసే పక్షంలో విశ్వంభరని ఏప్రిల్ 10న చూడొచ్చు. లేదంటే మే 9న చిరు సినిమా వస్తుంది.