అవును..కిషన్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ గెలిచారు. గోల్కొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడి నియామకం విషయంలో నెగ్గారు. గతంలో రాజాసింగ్ చేసిన ప్రతిపాదనలను ఏమాత్రం పట్టించుకునేవారు కాదు.మొదటిసారి ఆయన సిఫార్సులను పార్టీ పరిగణనలోకి తీసుకోవడంతో రాజాసింగ్ గెలిచారంటూ పార్టీలో చర్చ నడుస్తోంది.
ఇటీవల సైతం తను సిఫార్స్ చేసిన నేతను కాదని మరో వ్యక్తికి బాధ్యతలు అప్పగించడంతో రాజాసింగ్ అలకాబూనారు. ఇక బీజేపీలో ఉండటం సాధ్యం కాదని, తను వేరే దారి చూసుకుంటానని పార్టీకి అల్టిమేటం జారీ చేశారు. రాజాసింగ్ ప్రతిసారి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తుంటారు..ఈసారి మాత్రం కాస్త డోస్ పెంచేశారు. దీంతో రాష్ట్ర నాయజత్వంతో జాతీయ నాయకులు మాట్లాడారేమో కానీ, రాష్ట్ర నాయకత్వం ఎట్టకేలకు దిగివచ్చింది.
రాజాసింగ్ సూచించిన వ్యక్తికే మొదటిసారి గోల్కొండ జిల్లా అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టారు. దీంతో రాజాసింగ్ ఎలాంటి నిర్ణయాలకు సిద్ధపడుతారోననే ఉత్కంఠకు తెరపడింది. కానీ, ఇంతటితో శాంతిస్తారా.. ఈ ఎపిసోడ్ తో తను అనుకున్నవి సాధించేందుకు మరింత పట్టుదలతో సాగుతారా? అనేది చర్చనీయాంశం అవుతోంది.