తెలంగాణ బీజేపీలో నిన్నమొన్నటిదాకా ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. ఆయన ఎంత వివాదాస్పద రాజకీయం చేస్తారో.. సొంత పార్టీతోనూ అంతే స్థాయిలో వివాదాస్పదంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎమ్మెల్యేగా ఉన్న తన నియోజకవర్గంలో కార్పొరేటర్ సీట్లు తన అనుచరులకు కాకుండా ఇతరులకు ఇచ్చారంటూ ఆయన తాజాగా బండి సంజయ్‌పై మండి పడుతున్నారు. బండి సంజయ్‌కు వ్యతిరేకంగా ఓ ఆడియోను వడిుదల చేశారు. తనకు బండి సంజయ్ అన్యాయం చేశారని.. మండిపడ్డారు. తన అనుచరులకు గన్‌ఫౌండ్రీ, బేగంబజార్ టికెట్లు అడిగితే ఇవ్వలేదని.. నా నియోజకవర్గాన్ని నాకు వదిలేయాలని రిక్వెస్ట్ చేసినా పట్టించుకోలేదన్నారు. 2018లో నా విజయానికి కృషి చేసిన వ్యక్తికి టికెట్ ఇప్పించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
అల్లుడు చనిపోయిన విషాదంలో ఉన్నానని .. మూడు రోజుల తర్వాత జాతీయ నాయకత్వానికి లేఖ రాస్తానని అందులో చెప్పుకొచ్చారు. రాజాసింగ్ గోషామహల్ నియోజకవర్గం. అక్కడ అన్ని డివిజన్లలో మెజార్టీ ఓట్లు హిందువుల ఓట్లే ఉంటాయి. పోటాపోటీగా ఎంఐఎం ఉంటుంది. కాబట్టి.. ఓట్లన్నీ రెండుపార్టీల మధ్య చీలిపోతాయి. ఈ కారణంగా బీజేపీ ఆ నియోజకవర్గంలో ఉన్న డివిజన్లన్ని గెలుచుకునే అవకాశం ఉందన్న చర్చ ఉంది. అందుకే.. అక్కడి వాటికి డిమాండ్ పెరిగింది. ఉన్న ఏకైక ఎమ్మెల్యే కూడా పట్టించుకోకుండా లక్ష్మణ్, బండి సంజయ్ టిక్కెట్లను వేరేవారికి కేటాయించారు. అయితే.. రాజాసింగ్ వ్యవహారం ఇప్పుడే అసంతృప్తిగా లేదు. ఆయన నిత్య అసంతృప్తి వాది. కిషన్ రెడ్డి చీఫ్ గా ఉన్నప్పుడూ అదే తంతు.
ఆయన ఓ సందర్భంలో బీజేపీకి రాజీనామా చేసి.. శివసేన పార్టీ తెలంగాణ బాధ్యతలు తీసుకుంటారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ అమిత్ షా తెలంగాణ టూర్‌కి వచ్చినప్పుడు బుజ్జగించడంతో ఆగిపోయారు. ఆయితే ఆయన రాజకీయంతో బీజేపీ నష్టమేనని అనుకుంటారో.. లేకపోతే.. ఆయన దూకుడు వల్ల తమకు నష్టమనుకుంటారో కానీ… తెలంగాణ బీజేపీ నాయకత్వంలో ఎవరు ఉన్నా… ఆయనను ప్రోత్సహించరు. ఫలితంగా రాజాసింగ్ అసంతృప్తి వాదిగానే కొనసాగుతున్నారు.