తెలుగు360 రేటింగ్: 2/5
ఆర్.ఎక్స్ 100 తరవాత.. కార్తికేయ మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. వరుసగా అవకాశాలు. కొత్తగా వచ్చిపడిపోయిన క్రేజ్. వీటి మధ్య ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. చేతిలో ఉన్న సినిమాలు చూసుకుని సంతృప్తి పడిపోతే – కథల ఎంపికలో తేడా కొట్టేస్తుంటుంది. బహుశా.. కార్తికేయ విషయంలోనూ అదే జరిగి ఉంటుంది. ఆర్.ఎక్స్. 100 తరవాత.. చాలా సినిమాలే చేశాడు గానీ, ఏదీ తనకు తొలి విజయాన్ని మరిపించే తీపి గురుతుగా మిగల్లేదు. దాంట్లో చాలా సినిమాల పరాజయాలకు కారణం.. కథల విషయంలో కార్తికేయ చేసిన తప్పులే. అయితే ఆర్.ఎక్స్ 100 అనే ముద్రే ఇన్నాళ్లూ తనకి శ్రీరామరక్షగా మిగిలిపోయింది. తొలి హిట్టు గాలివాటంగా పడిందన్న అపవాదు పోవాలంటే, మరో హిట్టు తన ఖాతాలో వేసుకోవాల్సిన అగత్యం, అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వచ్చిన సినిమా `రాజా విక్రమార్క`. మరి ఈసారి కార్తికేయ ఏం చేశాడు? పట్టు వదలని విక్రమార్కుడులా ప్రయత్నిస్తున్న కార్తికేయ.. చివరికి హిట్టు పట్టాడా, లేదా?
కథలోకెళ్తాం. విక్రమ్ (కార్తికేయ) ఓ ఎన్.ఐ.ఏ ఆఫీసర్. చూసి రమ్మంటే కాల్చి వచ్చేరకం. హో మినిస్టర్ చక్రవర్తి (సాయి కుమార్)కి ఓ ముప్పు ఏర్పడుతుంది. అదీ మాజీ నక్సలైట్ వల్ల. విక్రమ్ తొందరపాటు వల్ల.. హోం మినిస్టర్ కేసులో దొరికిన కీలకమైన ఆధారం చేచేతులా జార విడచినట్టు అవుతుంది. అందుకే హోం మినిస్టర్‌ని కంటికి రెప్పలా కాపాడే బాధ్యత కూడా విక్రమ్పైనే పడుతుంది. హోం మినిస్టర్ ని కాపాడాలి. అదీ.. మినిస్టర్ కి తెలియకుండా. అదీ టాస్క్. దాంతో.. విక్రమ్ ఎల్.ఐ.సీ ఏజెంట్ గా మారి, హోం మినిస్టర్ కూతురు కాంతి (తాన్యా రామచంద్రన్)ని ప్రేమలో దింపి, తనకు దగ్గరై… అలా.. అలా.. చివరికి హోం మినిస్టర్ పై జరగాల్సిన ఎటాక్ ఆపుతాడు. కాకపోతే.. నక్సలైట్ల ఎటాక్ హోం మినిస్టర్ పై కాదని, మరొకరిపై అని తేలుతుంది. ఆ ఎటాక్ ఎవరిపైన? వాళ్లని విక్రమ్ ఎలా కాపాడాడు? అనేదే మిగిలిన కథ.
ఎన్.ఐ.ఏ ఏజెంట్ కథలు అనగానే.. ఇది వరకు మనకు పెద్దగా పరిచయం ఉండేవి కావు. అయితే.. ఫ్యామిలీమెన్ సిరీస్ వల్ల… వాళ్ల జీవితాలు ఎలా ఉంటాయి? ఆపరేషన్లు ఎంత పకడ్బందీగా చేస్తారు? అనే విషయాలు తెలిశాయి. అయితే.. ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్‌లలో ఉన్న వ్యూహాత్మకత… వాళ్ల చతురత.. మన తెలుగు సినిమా ఎన్ఐఏలో కనిపించదు. కార్తికేయ బాడీ లాంగ్వేజ్, తన ఆటిట్యూడ్ చూస్తుంటే నిజంగానే ఎల్ ఐ సీ ఏజెంట్ లా ఉంటాడు తప్ప, ఎన్.ఐ.ఏలా కనిపించడు. ఆ డౌటు దర్శకుడికి కూడా వచ్చి ఉంటుంది. అందుకే `నాకు మాత్రం నువ్వు ఎన్.ఐ.ఏ` ఏజెంట్ అంటే నమ్మ బుద్ధి కావడం లేదు.. అని ఓసారి హీరోయిన్ చేతే అనిపిస్తాడు దర్శకుడు. నిజానికి అసలు రాసుకున్న థ్రెడ్ లోనే బలం లేదు. హోమ్ మినిస్టర్ కి ఆపద ఉందని తెలిసి, దాన్ని అడ్డుకోవడానికి ఇలా రహస్యంగా డీల్ చేయడం ఏమిటో అర్థం కాదు. పైగా ఎల్.ఐ.సీ ఏజెంట్ అవతారం ఎత్తి, హోం మినిస్టర్ ఇంటికి, పిక్నిక్ స్పాట్ కి వెళ్లినట్టు ఆడుతూ, పాడుతూ వెళ్లిపోతుంటాడు హీరో. హర్షవర్థన్ ఇన్సురెన్స్ ఏజెంట్ పాత్రకు సూటైపోయాడు గానీ, తను డాన్స్ మాస్టర్ అంటేనే అడ్జిస్ట్ అవ్వడానికి మనసు ఒప్పుకోదు. హోం మినిస్టర్ ని కాపాడడం కథలో కీలకమైన విషయం. ఆ పాయింట్ దగ్గరకు వెళ్లడానికి… కథని నానా తిప్పలు పెట్టాడు. హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ విసిగిస్తుంది. `రాజా విక్రమార్క`పై నమ్మకాలు పూర్తిగా పడిపోతున్న వేళ.. ఇంట్రవెల్ బ్యాంగ్ తో.. కాస్త ఊపిరి పోస్తాడు.
కానీ ఆ ఉత్సాహం కూడా అంతంత మాత్రమే. ఓ హోం మినిస్టర్ కూతుర్ని కిడ్నాప్ చేస్తే.. ఎన్.ఐ.ఏ, లోకల్ పోలీసులు ఉన్నా – వాళ్లవల్ల ఏం కాదు. స్టేజ్‌పై డాన్స్ చేస్తున్న హీరోయిన్.. అక్కడి నుంచి గుంటలో పడిపోవడం ఏమిటో? కిడ్నాప్ అవ్వడం ఏమిటో? దర్శకుడు చాలాచోట్ల.. లాజిక్కులకు దూరంగా, తనకిష్టానుసారంగా కథని రాసుకుంటూ వెళ్లిపోయాడు. హోం మినిస్టర్ కూతుర్ని రక్షించడానికి ఎన్.ఐ.ఏ కిడ్నాపర్లతో బేరం ఆడుతుంటుంది. ఇంతలో ఇన్సురెన్స్ ఏజెంట్ (హర్షవర్థన్) ఫోను లాక్కుని.. `అంత ఇవ్వలేం.. రేపిస్తాం..`అంటూ బేరం చేస్తుంటాడు. అసలు ఎంత సిల్లీగా ఉంటుందా సీన్..? ఎక్చేంజ్ సీన్ లో కూడా దర్శకుడు ఏదేదో చేశాడు. విలన్ ని రివీల్ చేయడమే పెద్ద ట్విస్ట్ అని దర్శకుడు భావించి ఉంటాడు. బహుశా… టీమ్ అంతా దాన్నే నమ్మి ఉంటుంది. కానీ విలన్ ని రివీల్ చేసే సీన్ చాలా పేలవంగా ఉంది. దానికి తోడు.. తొలి సీన్ లో సదరు పాత్రధారిని చూసినప్పుడే `వీడేనా అసలు విలన్` అన్నట్టు అర్థమవుతూనే ఉంటుంది. కథకు ప్రాణమైన ట్విస్ట్ ని ప్రేక్షకులు ముందే ఊహించడం ఓ పెద్ద మైనస్ అయితే, దాన్ని రివీల్ చేసిన విధానం అంత కంటే.. పెద్ద మైనస్.
కార్తికేయ యాక్షన్ పాత్రలకు బాగా సూటవుతాడు. ఈసారి తను కామెడీ కూడా ట్రై చేశాడు. కాకపోతే.. ఇలాంటి పాత్రలకు సీరియస్లుక్స్, సీరియస్ క్యారెక్టరైజేషనే బెటర్ అనిపిస్తుంది. తనని కొన్ని సన్నివేశాల్లో దర్శకుడు స్టైలీష్ గా చూపించాడు. కానీ పూర్తి స్థాయిలో కార్తికేయ శక్తి సామర్థ్యాల్ని చూపించే పాత్ర కాదిది. తాన్యలో హీరోయిన్ క్వాలిటీస్ ఏమాత్రం కనిపించవు. అందుకే సెకండాఫ్‌లో దర్శకుడు దాదాపు తనని కనిపించకుండా చేశాడు. సాయి కుమార్ మరోసారి రొటీన్ పాత్రే చేశాడు. తన లుక్స్ ఈ సినిమాలో అస్సలు బాలేదు. ముఖ్యంగా మీస కట్టు. తనికెళ్ల భరణి ఓకే అనిస్తాడు. తనకు రాసుకున్న డైలాగులు కొన్ని బాగున్నాయి. సుధాకర్ కోమాకుల తొలి సగంలో `ఇదన్నెందుకు తీసుకున్నారు` అనిపించేలా నటించాడు. ద్వితీయార్థంలో మాత్రం కాస్త న్యాయం చేసినట్టు కనిపించాడు. కాస్తలో కాస్త హర్షవర్థనే ఈ కథకు రిలీఫ్ ఫ్యాక్టర్.
ఈ కథని దర్శకుడు ఎలా చెప్పి ఒప్పించాడో నిర్మాతలకూ, హీరోకే తెలియాలి. లైన్ చాలా పాతది. దాంట్లో లాజిక్కులు లేవు. ప్రొడక్షన్ పరంగా కాస్త ఖర్చు పెట్టారు. పాటలకు స్కోప్ లేదు. ఉన్న రెండు మూడు పాటలూ.. వినేలా లేవు. యాక్షన్ సీన్లలో కాస్త కష్టపడినట్టు కనిపిస్తుంది. కొన్ని డైలాగులు బాగున్నాయి. అంతకు మించి.. ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.
ఫినిషింగ్ టచ్: పట్టువదిలిన విక్రమార్కుడు
తెలుగు360 రేటింగ్: 2/5