కాంగ్రెస్‌ను ముంచేసి బీజేపీలోకి వెళ్లినట్లే.. ఇప్పుడు బీజేపీని కూడా అదే విధంగా ముంచేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా అధికారిక ప్రకటన చేశారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా… అభ్యర్థుల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు తాను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నట్లు ఆయన చెబుతున్నారు.
శుక్రవారం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. ఆయనకు కాంగ్రెస్ టిక్కెట్ ప్రకటించే అవకాశం ఉంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున మునుగోడు నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఆయన కాంగ్రెస్ ను విమర్శిస్తూనే ఉన్నారు. పార్టీని నానా తిప్పలు పెట్టారు. మొదట్లోనే బీజేపీతో మాట్లాడుకుని ఆ పార్టీలో చేరిపోతానని ప్రకటించారు. తర్వాత ఎందుకో ఆగిపోయారు. కొన్నాళ్లకు బీఆర్ఎస్ ను ఓడించే పార్టీ బీజేపీనేనని చెప్పడం ప్రారంభించారు. చివరికి గత ఏడాది బీజేపీలో చేరి ఉపఎన్నిక తీసుకు వచ్చారు. ఇది కూడా పెద్ద ప్లానేనని.. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా చంపే కుట్ర అని అందరికీ అర్థమయింది. ఆ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి ఓడిపోయారు.
తర్వాత బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో ఇక ఆయన మళ్లీ కాంగ్రెస్ వైపు చూడటం ప్రారంభించారు. సోదరుడు వెంకటరెడ్డి.. రాజగోపాల్ రెడ్డికి టిక్కెట్ ఖరారు చేయించడం ఖాయం కాబట్టి ఆయన రీ ఎంట్రీ ఖాయమైపోయింది. అయితే ఇలాంటి గోడమీద పిల్లి లాంటి నేతల్ని నమ్ముకుని కాంగ్రెస్ ఎం బావుకుంటుందన్న చర్చ కాంగ్రెస్‌లోనూ సాగుతోంది.