తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు అయిపోయిందని అనుకులోనేలోపే కొత్త కొత్త అడ్డంకులు వస్తున్నాయి.. ఉగాది రోజున సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ ను కలవడంతో మూడో తేదీన మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అందరూ మానసికంగా రెడీ అయిపోయారు. ఎవరెవరికి బెర్తులన్నదానిపై కాంగ్రెస్ లో చర్చోపచర్చలు జరిగాయి. కానీ ఇప్పుడు ఈ అంశంపై ప్రతిష్టంభన ఏర్పడింది. హైకమాండ్ నుంచి ఎలాంటి సమాచారం రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు చేరలేదు. ముఖ్యమంత్రికీ రాలేదు.
ఈ పరిస్థితికి కారణంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డేనని చెబుతున్నారు. ఆయన పార్టీ నుంచి వెళ్లి మళ్లీ వచ్చారు, ఇలా వచ్చే ముందు ఆయనకు మంత్రి పదవి హామీ ఇచ్చామని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే రాహుల్ మాత్రం.. ఆయన సోదరుడు ఇప్పటికే మంత్రిగా ఉంటే మరో సోదరుడ్ని ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చినందున తీుకోవడం మంచిదని రాహుల్ కు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ రాహుల్ సమాధానపడలేదు.
ఏ విషయం చెబుతామని ఆయన చెప్పి వెళ్లిపోయారు. కానీ మళ్లీ సమాచారం రాలేదని తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేబినెట్ లో చోటు కల్పించడం క్లిష్టంగా మారింది, ఆయన మాత్రం.. తనకు పదవి ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారు. తనకు హోంశాఖ ఇష్టమని కూడా ఆయన చెబుతున్నారు. రాహుల్ అడ్డుపుల్ల వేస్తే ఎవరూ ఏమీచేయలేరు. కానీ ఆయన ఎలా స్పందిస్తారన్నదే కీలకం. ఎందుకంటే ఆయనకు కాంగ్రెస్ కన్నా పదవే ముఖ్యం. అందుకే గత ఐదేళ్లూ కాంగ్రెస్ పతనానికే పని చేశారు. చివరికి మునుగోడు ఉపఎన్నిక కూడా తెచ్చారు. కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. మళ్లీ గెలుస్తారని నమ్మకం కుదిరిన తర్వాతనే ఆయన పార్టీలో రీ జాయిన్ అయ్యారు.