రాజమండ్రి పేరును ప్రజలకోరికపై రాజమహేంద్రవరంగా మారుస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశం ముగిశాక నిన్న విజయవాడలో ప్రకటించారు. పుష్కరాల చివరిరోజున రాజమండ్రిలో పౌరప్రముఖుల సమావేశంలో ముఖ్యమంత్రి ”మీ ఊరి పేరు రాజమహేంద్రవరంగా మార్చాలనుకుంటున్నాం మీ అభిప్రాయం చెప్పండి” అని అడిగారు. మార్చండి అని సభికులు సూచించారు. ఊరి పేరుమార్చాలని ఈ మూడునెలల్లోగాని, అంతకు ముందుగాని ముఖ్యమంత్రిని కోరిన ప్రజలుఎవరోగాని ”రాజమండ్రి”, రాజమహేంద్రి”,”రాజమహేంద్రవరం”, ”రాజమంద్రి” పేర్లపై వాదోపవాదాలు చెలరేగాయి. ”రాజమహేంద్రవరం” గా పేరు మార్చాలన్న పౌరప్రముఖుల విజ్ఞప్తి మీద 1980 లోనే మున్సిపల్ కౌన్సిల్ లో చర్చజరిగింది. ఈ పేరు సరికాదని ”రాజమహేంద్రి” పేరే సరైనది అని మరికొందరు పౌరప్రముఖులు విజ్ఞప్తి చేశారు. ఈ రెండు బృందాల లోనూ వున్నది విశిష్టులైన సాంస్కృతిక సంస్ధల వారు కావడంతో మున్సిపాలిటీ పేరుమార్పు పై రాష్ట్రప్రభుత్వానికి ఏ విధమైన సిఫార్సులనూ పంపలేదు.
అయితే ఆ ప్రతిపాదనల ప్రభావం చాలాకాలం వుంది. ”రాజమహేంద్రి మహిళా కళాశాల” , ”రాజమహేంద్రవరం సారస్వత సమితి” వంటి పేర్లు ఆసమయంలో ఆవిర్భవించినవే! స్ధానిక దినపత్రికలలో కొన్ని డేట్ లైన్ మీద రాజమహేంద్రి అనీ మరికొన్ని రాజమహేంద్రవరం అనీ ప్రచురించేవి. ఒకటి రెండు పేపర్లయితే రాజమంద్రి అని కూడా రాసేవి. రాజమహేంద్రి బ్రిటీష్ వారి నోరు తిరగక రాజమండ్రి అయిందని సహకారశాఖ రిటైర్డ్ అధికారి పతివాడ సూర్యనారాయణ అప్పట్లో చెప్పేవారు. రాజరాజనరేంద్రుడి రాజధాని కనుక ఇది రాజమహేంద్రవరమే నని వాణిజ్య పన్నుల శాఖ రిటైర్డ్ అధికారి పతివాడ నరశిహారావు వాదించేవారు. రాజమహేంద్రవరమే రైటని ‘కళాగౌతమి’ సంస్ధా, రాజమహేంద్రే కరెక్టని ఆంధ్రకేసరి యువజన సమితి సమావేశాలు పెట్టి వివరించేవి.
ఇది మిట్టపల్లాలేతప్ప కొండలు వున్న పట్టణం కాదుకనుక రాజమహేంద్రి నప్పేపేరుకాదని, ఊర్లకు పేర్లలో పురాలు (రామచంద్ర పురం) వరాలు (ముమ్మిడి వరం) సహజంకనుకా, రాజమహేంద్రవరమే ఈ నగరానికి తకిన పేరు అనీ సుప్రసిద్ద పండితుడు మధిర కృష్ణమూర్తి శాస్త్రి ఒక ప్రకటన చేశారు. ఆతరువాత రాజమండ్రి పేరుపై వివాదం సమసిపోయింది. ఎమ్మెల్యేలుగా వున్నవారు గాని, ప్రతి పక్షాల నాయకులుగాని రాజమండ్రి పేరు వివాదంలో తలదూర్చలేదు సరికదా వేలైనా పెట్టలేదు. జనసామాన్యంలో ఇది పెద్ద వివాదంగా మారిపోకపోవడానికి ఇదే మూలం. ముప్పై ఐదేళ్ళ తరువాత ”ఎవరి కోరిక” మేరకు ఇది మళ్ళీ తెరమీదికి వచ్చిందో కాని రాజమండ్రి పేరు రాజమహేంద్రవరంగా మారిపోయింది. ఆయినా కూడా పేరు మార్పుకి వ్యతిరేకంగానో అనుకూలంగానో ఉద్యమాలు పోరాటాలు జరిగే పరిస్ధితి లేదు. ఎందుకంటే ప్రజలు వారి సౌలభ్యాన్ని బట్టే పేర్లను వాడుకుంటారు. దుర్గాబాయి దేశ్ ముఖ్ రోడ్డు అంటే ఎవరికీ తెలియదు. తెలిసిన వారు కూడా బైపాస్ రోడ్డు అనే అంటారు. కారల్ మార్క్స్ రోడ్డు ని ఆపేరుతో ఎవరూ ప్రస్తావించరు. బస్ కాంప్లెక్స్ రోడ్డు అంటేనే ఆరోడ్డుని రాజమండ్రి వాసులు గుర్తుపడతారు.
రాజమహేంద్రవరం పరిసరాల బస్ స్టాండ్ల దగ్గర వినిపించే ఎంక్వయిరీ ”రాయమండ్రి” బస్సు వెళ్ళలేదు కదా?? చుట్టుపక్కల పల్లెల్లో షేర్ ఆటో స్టాండ్ల వద్ద తరచు వినిపించే ప్రశ్న ” రాయమండ్రి” వస్తావా?? ఇది పంటికింద చుట్ట పీకను అదిమిపట్టి రాజమండ్రి అన్నప్పుడు వినిపించే మాట…అలా వినీవినీ నోట్లో చట్టలేనివారు కూడా తూర్పుగోదావరి రైతువారీ యాసతో ”రాయమండ్రి” అంటున్నారు.