సీఎం జగన్ నూతిలో దూకమన్నా దూకుతాం అని.. రాజమండ్రి రూరల్ టిక్కెట్ కేటాయించిన తర్వాత మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్న మాటలవి. నిజానికి రాజకీయంగా ఆయనను గొయ్యిలోనే దూకమని జగన్ ఆదేశించారు. ఆ విషయం ఆయనకు తెలుసేమో కానీ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజమండ్రి రూరల్లో టీడీపీ, జనసేన కూటమికి తిరుగులేని వాతావరణం
ఉభయగోదావరి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటల్లాంటి నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో రాజమండ్రి కూడా ఒకటి. రాజమండ్రి సిటీ, రూరల్ రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీదే హవా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి టీడీపీకి వ్యతిరేకమైన గాలి వీయడమో.. ఓట్లు చీలిపోయే పరిణామాలు వస్తే తప్ప రాజమండ్రిలో టీడీపీ ఓడిపోదు. రాజమండ్రిని సిటీ, రూరల్ రెండు నియోజకవర్గాలుగా మార్చిన తర్వాత కూడా టీడీపీ పట్టు కొనసాగుతోంది. రూరల్ నియోజకవర్గం ఏర్పాటు చేసిన తర్వాత మూడు సార్లు ఎన్నికలు జరిగితే మూడు సార్లు టీడీపీ గెలిచింది. రెండు సార్లు సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలిచారు. రూరల్ నియోజకవర్గంలో టీడీపీ పట్టు గట్టిగానే ఉంది.
రెండు మండలాల్లో జనసేనకు పూర్తి స్థాయిలో పట్టు
రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో కార్పొరేషన్ పరిధిలోని కొన్ని డివిజన్లతో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఏర్పాటయింది. ఈ అసెంబ్లీ స్థానంలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. కమ్మ, కాపు సామాజికవర్గాలదీ ప్రధాన పాత్రే. దాదాపుగా రెండున్నర లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కడియం మండలంలో జనసేన పార్టీ బలంగా ఉంది. అలాగే సిటీలోనూ.. ఆ పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది. వరుసగా రెండుసార్లు విజయం సాధించిన గోరంట్ల.. హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. పోటీ చేయాలని ఉత్సాహంగా ఉన్నా టిక్కెట్ కేటాయింపు సమస్యగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిట్టింగ్లకు టికెట్ ఇవ్వాలని టీడీపీ భావిస్తున్నా.. పొత్తు కుదిరితే ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించే అవకాశం కనిపిస్తోంది.
కందుల దుర్గేశ్ కోసం పట్టుబట్టనున్న జనసేనాని
గత ఎన్నికల్లో ఇక్కడి నుంటి జనసేన తరఫున పోటీ చేసిన కందుల దుర్గేశ్.. 42వేలకు పైగా ఓట్లు సాధించారు. జిల్లా రాజకీయాల్లోనూ దుర్గేశ్ది కీలక పాత్ర కావడంతో.. ఈ స్థానం కోసం జనసేన పట్టు పట్టే అవకాశాలు ఉన్నాయి. అందుకే గోరంట్ల బచ్చయ్య పోటీ చేస్తారా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. ఇతర నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులున్నారు కాబట్టి సర్దుబాటు చేయడం కూడా కష్టమే.
గోరంట్ల బుచ్చయ్యకు టిక్కెట్ ఉందా లేదా అన్న సంగతి పక్కన పెడితే.. టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి నిలబడితే.. మెజార్టీ ఎంత వస్తుందన్న లెక్కలే ఎక్కువ మంది వేస్తున్నారు. టీడీపీ సంప్రదాయక ఓటింగ్., జనసేన ఓటింగ్ కలిపితే.. వైసీపీ అభ్యర్థి తట్టుకోవడం కష్టమన్న అంచనాలు ఉన్నాయి.