హైదరాబాద్: కోడలు సారిక, మనవళ్ళ సజీవదహనం ఘటనకు సంబంధించి మాజీ ఎంపీ రాజయ్యను, ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మధ్యాహ్నం సారిక, ఆమె కుమారుల మృతదేహాలను మార్చురీకి తరలించటం పూర్తికాగానే రాజయ్య కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవాళ తెల్లవారు ఝామున జరిగిన ప్రమాదంలో సారిక, ముగ్గురు చిన్నపిల్లలు చనిపోయారు. ఇది ఆత్మహత్యా, హత్యా అనేది మిస్టరీగా మారింది. సిలిండర్ లీక్ చేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటే అక్కడ పేలుడు సంభవించిఉండేదనే వాదన వినిపిస్తోంది. మరోవైపు ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మహిళ, ముగ్గురు పసిపిల్లలు కాలి ముద్దల్లా మారిపోవటంతో, స్థానికులు, మహిళా సంఘాల సభ్యులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. మహిళా సంఘాలు ఉదయంనుంచి రాజయ్య ఇంటిముందు చేరి నిందితులను అరెస్ట్ చేయాల్సిందేనని ఆందోళనకు దిగారు. సారిక పుట్టింటివారు మీడియాతో మాట్లాడుతూ, ఇవి ముమ్మాటికీ హత్యలేనని ఆరోపించారు. రాజయ్య కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సారిక ఆత్మహత్య చేసుకునేటంత పిరికిది కాదని అన్నారు. తనను భర్త నిరాదరించాడని, అత్తమామలు దారుణంగా వేధించారని సారిక గతంలో మీడియా ముందు ఆరోపించిన ఫైల్ షాట్స్ తాజాగా బయటికి వచ్చాయి. అనిల్ వేరే పెళ్ళి చేసుకోవటానికి తన అత్తమామలు సహకరించారని ఆరోపించారు.