దర్శకుడ్ని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటుంటాం గానీ…
ఎప్పుడిచ్చారు మన హీరోలు అంత ఫ్రీడమ్..
స్టీరింగ్ దర్శకుడి చేతుల్లో ఉన్నట్టే ఉంటుంది..
డైరక్షన్ మాత్రం హీరోలు చేస్తుంటారు..
ఇటు పోనీయ్… అటు పోనియ్…. కాస్త స్లో.. ఇప్పుడు స్పీడు అంటూ… కంగాళీ చేసేస్తుంటారు.
హీరోల చేతుల్లోనే ఇండ్రస్ట్రీ ఉందన్నది నిజం. అది దర్శకుల చేతుల్లోకీ వెళ్లిందంటే…. అది రాజమౌళి లాంటి దర్శకుల చలవే.
పూరి, వినాయక్ లాంటి వాళ్లు కూడా… తమ హవా చూపించారు గానీ, రాజమౌళి అంత కాదు.
ఇప్పుడు రాజమౌళి చెప్పిందే వేదం.. తీసిందే సినిమా.. అంతే. అందుకే కనీ వినీ ఎరుగని మల్టీస్టారర్ సిద్ధం చేస్తున్నాడు. కొణిదెల ఫ్యామిలీనీ, నందమూరి కుటుంబాన్నీ కలిపేసే గొప్ప ప్రయత్నం చేస్తున్నాడు. రామ్ చరణ్ – ఎన్టీఆర్ల సినిమాకి శ్రీకారం… తప్పకుండా తెలుగు చిత్రసీమలో ఓ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుందన్నది నిజం.
ఎన్టీఆర్, చరణ్ సినిమా…
ఎప్పుడైనా ఊహించామా ఈ అద్భుతం. కలలో అయినా చూశామా ఈ కాంబో!
ఎన్టీఆర్ అనుకున్నా, చరణ్ కలగన్నా… ఈ కాంబినేషన్ ఫిక్సయ్యేది కాదు. టాలీవుడ్ లోని నిర్మాతలంతా కట్టకట్టుకుని వచ్చినా ఈ మల్టీస్టారర్ కుదిరేది కాదు. అంతా జక్కన్న మహిమ. ఆయన ఏం చెబితే అది జరుగుతోంది టాలీవుడ్లో. దర్శకుడి కెపాసిటీ అది. ‘ఇదిగో మనం కలిసి సినిమా చేస్తున్నాం…’ అంటే ‘ఓకే’ అనేశారిద్దరూ. ‘కథేంటి? అందులో నా పాత్రేంటి?’ అని అడిగే సాహసం కూడా చేసుండరు. ఎందుకంటే అక్కడున్నది జక్కన్న కాబట్టి. దేశంలోని బడా హీరోలంతా ఆయనతో సినిమా చేయడానికి ఎదురు చూస్తున్నారు. ఆ అవకాశం తమకొస్తే.. ఎదురు ప్రశ్నలేసి విసిగించే అలవాటు… చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికీ లేదు.
రాజమౌళి లాంటి స్టేటస్ ప్రతీ తరంలోనూ… ఏదో ఓ దర్శకుడికి వచ్చింది. అయితే వాళ్లంతా ఆ స్టార్ హోదా అనుభవించారే తప్ప…. ఇలాంటి కొత్త కొత్త కాంబినేషన్లు సెట్ చేయాలని చూడలేదు. మన అదృష్టం కొద్దీ.. రాజమౌళి అలాంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా వస్తుందో రాదో.. వచ్చినా.. రికార్డులు బద్దలు కొడుతుందో లేదో మనకు తెలీదు. ఏమో.. ఏమైనా జరగొచ్చు. కానీ సినిమా మొదలవ్వకముందే.. ఓ అద్భుతం జరిగింది. ”నా హీరో గొప్ప… నీ హీరో జీరో” అని వాగే నోళ్లకు తాత్కాలికంగా మూతలు పడ్డాయి. ”ఇది హీరోల రాజ్యం” అని విర్రవీగే కాలర్లు చతికిల పడ్డాయి. అందుకే…. రాజమౌళికి అర్జెంటుగా ఓ వీరతాడు వేయాల్సిందే.