ప్రభాస్ – రాజమౌళిల బంధం విడదీయలేనిది. ఛత్రపతి లాంటి మాస్ హిట్ ఇచ్చి, మాస్ హీరోగా ప్రభాస్‌ని ఎక్కడో కూర్చోబెట్టాడు రాజమౌళి. ఇక బాహుబలి గురించి చెప్పాల్సిన పనిలేదు. మరో పాతికేళ్లయినా ఈ సినిమా గురించి సినీ ప్రపంచం మాట్లాడుకుంటూనే ఉంటుంది. ప్రభాస్ వేడుక అంటే రాజమౌళి రాకుండా ఎలా ఉంటాడు? సాహో ప్రీ రిలీజ్ వేడుకకు రాజమౌళినే ప్రత్యేక అతిథి. ఈ వేడుకలో మరోసారి ప్రభాస్ – రాజమౌళి మధ్య అనుబంధం ఆవిష్కృతమైంది. ప్రభాస్, రాజమౌళి ఇద్దరూ పాత స్నేహితులు మళ్లీ కలుసుకున్న రేంజులో.. హాయిగా నవ్వుతూ, తుళ్లుతూ మాట్లాడుకోవడం ఆకట్టుకుంది.
రాజమౌళి మాట్లాడుతూ ”ప్రతీ హీరో అభిమాని…తమ హీరో సినిమా హిట్టవ్వాలని కోరుకుంటాడు. కానీ.. అందరు అభిమానులూ ప్రభాస్ సినిమా హిట్టవ్వాలని కోరుకుంటారు. ప్రభాస్ పాజిటీవ్ థింకింగ్ వల్ల ఇంత మంది అభిమానులు ప్రభాస్‌కి ఏర్పడ్డారు. ప్రభాస్‌కి దూరదృష్టి ఎక్కువ. బాహుబలి సమయంలోనే తరవాత ఎలాంటి సినిమా చేయాలా? అని ఆలోచించాడు. బాహుబలి హిట్టవుతుందని తనకు ముందే తెలుసు. ఆ తరవాత సినిమా కూడా అదే స్థాయిలో ఉండాలని తపన పడ్డాడు. ఓరోజు నా దగ్గరకు వచ్చి `సుజిత్ మంచి కథ చెప్పాడు డార్లింగ్ అదిరిపోయింది` అన్నాడు. బాహుబలి తరవాత మరో పెద్ద దర్శకుడితో సినిమా చేయ్యొచ్చు. కానీ సుజిత్‌ని నమ్మి, తాను చెప్పిన కథని నమ్మి ఈ సినిమా చేశాడు. బాహుబలి తరవాత ఇలాంటి సినిమా తీస్తే జనాలకు నచ్చుతుందని నమ్మాడు. రెండో సినిమాకి ఇంత పెద్ద బాధ్యతని హ్యాండిల్ చేయగలడా? లేడా? అని సుజిత్పై చాలామంది డౌటు పడ్డారు. ఫస్ట్ లుక్ కి ఆ అనుమానాలు కాస్త తగ్గాయి. ట్రైలర్‌కి పటాపంచలైపోయాయి. ప్రభాస్ ఎప్పుడో నేషనల్ స్టార్ అయిపోయాడు. ఈసినిమాతో తను మరింత ముందుకు వెళ్లాల”న్నారు.