‘ఆర్.ఆర్.ఆర్’ టైటిల్ విషయంలో చాలా తర్జన భర్జనలు జరిగాయి. ఆర్.ఆర్.ఆర్ కి సరిపోయేలా టైటిల్స్ సూచించమని అభిమానుల్ని కోరింది చిత్రబృందం. చివరకు రణం రౌద్రం రుధిరం అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. అయితే… ఈ టైటిల్ జనంలోకి పెద్దగా వెళ్లలేదు. ఎబ్రివేషన్ ఇచ్చినా సరే.. ఈ సినిమాని `ఆర్.ఆర్.ఆర్` అనే పిలుస్తున్నారు. రాజమౌళి కూడా `ఈ సినిమా పేరు ఆర్.ఆర్.ఆర్ నే` అంటున్నాడు.
“పాన్ ఇండియా సినిమా ఇది. అన్ని భాషల్లోనూ ఒకే టైటిల్ ఉండాలి. మార్కెట్ పరంగా అదే కరెక్టు. అయితే.. ఆర్.ఆర్.ఆర్ అనేదానికి ఓ అర్థం అంటూ ఉండాలన్న ఉద్దేశంతో ప్రతీ భాషకూ ఓ టైటిల్‌ని ప్రకటించాం. కానీ… దానికి పెద్దగా ప్రాధాన్యం లేదు. మేం కూడా మాత్రం దీన్ని త్రిబుల్ ఆర్ అనే పిలుస్తున్నాం. ప్రేక్షకులు, అభిమానులు, సినిమా వాళ్లు అందరూ దీన్ని త్రిబుల్ ఆరే అంటున్నారు. సో.. దీని టైటిల్ కూడా అదే” అంటున్నాడు రాజమౌళి. నిజానికి ఓ సందర్భంలో ‘ఆర్.ఆర్.ఆర్’కి ఎబ్రివేషన్లు ఏమీ ఇవ్వకుండా టైటిల్‌ని అలానే ఉంచేద్దాం అనుకున్నారు. కానీ… టైటిల్‌కి ఏదో ఓ అర్థం ఉండాలన్న విషయంలో రాజీపడి… ఎబ్రివేషన్ ఇచ్చారు. అయినా జనం నోట్లో త్రిబుల్ ఆర్ గానే స్థిరపడిపోయింది.