లాక్ డౌన్ వల్ల ఎక్కడి షూటింగులు అక్కడ ఆగిపోయాయి. సినిమా విడుదల తేదీలు గల్లంతయ్యాయి. ఆర్.ఆర్.ఆర్కీ ఈ సమస్య ఉంది. జనవరి 8న రావాల్సిన ఈసినిమా… వేసవికి షిఫ్ట్ అయ్యింది. అయితేకొత్త విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు.
ఈలోగా… షూటింగుల పునః ప్రారంభంపై ఆశలు చిగురించాయి. జూన్ 1 లేదా, జూన్ మొదటి వారం నుంచీ షూటింగులు జరుపుకోవొచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. రేపటి నుంచే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చేసుకోవొచ్చని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా పచ్చ జెండా ఊపేశారు. ఎలా చూసినా చిత్ర సీమకు ఇది ఊరడింపే. జూన్ 1 నుంచి గనుక షూటింగులు మొదలైపోతే.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్.ఆర్.ఆర్ టీమ్ భావిస్తోంది. ఎందుకంటే.. సంక్రాంతి డేట్ ని మిస్చేసుకోవడం ఆర్.ఆర్.ఆర్ టీమ్ కి ఇష్టం లేదు. పాన్ ఇండియా సినిమా ఇది. డేట్ మారిస్తే.. మళ్లీ అన్ని భాషలకూ అనువైన తేదీని ఫిక్స్ చేయడం కష్టం. అందుకే ముందు చెప్పిన సమయానికే షూటింగ్ పూర్తి చేసే అవకాశాల కోసం చిత్రబృందంతో రాజమౌళి చర్చిస్తున్నారు. తక్కువ సమయంలో ఈ సినిమాని పూర్తి చేయడం ఎలా అని ఆలోచిస్తున్నారు.అవసరమైతే స్క్రిప్టులో చిన్న పాటి మార్పులు చేసి, లొకేషన్లు కుదించి ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. షూటింగులు మొదలైనా కరోనాకి భయపడి స్టార్లు బయటకు రారేమో అన్న అనుమానాలు ఉన్నాయి. కానీ ఎన్టీఆర్, చరణ్ మాత్రం తమ వైపు నుంచి పూర్తి భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. సో.. రాజమౌళి మొదటి టార్గెట్.. జనవరి 8నే. అది సాధ్యమా కాదా అనేది త్వరలోనే తెలిసిపోతుంది.