ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, అతని కుటుంబ సభ్యులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. రెండు వారాల నుంచి రాజమౌళి, కుటుంబ సభ్యులు హోం క్వారెంటైన్‌లోనే ఉంటున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. ఈరోజు మరోసారి టెస్ట్ చేయిస్తే… కరోనా నెగిటీవ్ అని తేలింది. ఈ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్లో ధృవీకరించారు. ”రెండు వారాల క్వారెంటైన్ పూర్తయ్యింది. ప్రస్తుతానికి ఎలాంటి లక్షణాలూ లేవు. కరోనా టెస్టులు చేయిస్తే.. నెగిటీవ్ వచ్చింది. ప్లాస్మా డొనేషన్ కోసం మరో మూడు వారాలు ఎదురు చూడమని వైద్యులు సూచించారు” అంటూ ట్వీట్ చేశారు.
రాజమౌళి కుటుంబం కరోనాని జయించడం సినీ అభిమానులకు ఊరటనిచ్చే విషయం. మరీ ముఖ్యంగా `ఆర్.ఆర్.ఆర్` కోసం ఎదురుచూస్తున్నవాళ్లకు. రాజమౌళి అనారోగ్యం నుంచి కోలుకుని.. ఈ సినిమాని త్వరగా సెట్స్‌పైకి తీసుకెళ్లాలని అభిమానులు భావిస్తున్నారు. కాకపోతే.. `ఆర్.ఆర్.ఆర్` ని సెట్స్‌పైకి తీసుకెళ్లడం అంత తేలికైన విషయం కాదు. సెప్టెంబరు వరకూ.. చిత్రబృందం అంత ధైర్యం చేయకపోవొచ్చు.