రామారావు (ఎన్టీఆర్ జూనియర్), రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతానికి ఇది వర్కింగ్ టైటిలే అనుకోండి! కాని ప్రేక్షకుల్లోకి చొచ్చుకుని వెళ్ళింది. చిత్రీకరణ మొదలు కావడానికి ఇంకా సమయం వుంది. రాజమౌళి ఎప్పుడంటే అప్పుడు… ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా పూర్తి చేసిన ఎన్టీఆర్ చిత్రీకరణకు రావడానికి సిద్ధమే. మరోపక్క బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సినిమా చిత్రీకరణ శరవేగంగా చేస్తున్న రామ్చరణ్ డిసెంబర్ నెలకు ఖాళీ అవుతాడు. బహుశా… డిసెంబర్ లేదా జనవరిలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ ప్రారంభమవుతుందని అంచనా. ఈలోపు పాటల్ని ఫైనలైజ్ చేయాలని రాజమౌళి పని చేస్తున్నారు. సినిమా సంగీతం గురించి కీరవాణితో చర్చలు జరుపుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి. కథ గురించి, కథానాయకుల పాత్రల గురించి ఒక్క విషయం కూడా బయటకు పొక్కకుండా రాజమౌళి జాగ్రత్త పడుతున్నారు. కీరవాణి ఆయనకు పెద్దన్న కాబట్టి మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఏయే విషయాలు చర్చకు వచ్చాయనేది బయటకు వచ్చే అవకాశమే లేదు. చిత్రీకరణ ప్రారంభమయ్యేలోపు పాటలు అన్నిటినీ సిద్ధం చేయాలనేది రాజమౌళి సంకల్పంగా తెలుస్తుంది.