దర్శకుడు రాజైతే… కెమరామ్యాన్ మంత్రి. ఈ ఇద్దరి ప్రతిభ, దూరద్రుష్టి, సమన్వయంతోనే విజువల్ వండర్ సాధ్యపడుతుంది. అందుకే కథ ఓకే చేసుకున్న వెంటనే మొదట ఫిక్స్ చేసుకునేది డివోపీనే. కొంతమంది దర్శకులకు ఆస్థాన కెమరామ్యాన్ కూడా వుంటారు. ప్రతి సినిమాకీ ఒకే డీవోపీని కొనసాగిస్తుంటారు. దర్శకధీరుడు రాజమౌళి, డీవోపీ కె. కె.సెంథిల్ కుమార్ కాంబినేషన్ కూడా ఇలాంటిదే. రాజమౌళి సినిమా అంటే డీవోపీగా మరో ఆలోచన లేకుండా కె. కె. సెంథిల్ కుమార్ పేరే వినిపిస్తుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ఈ కాంబినేషన్ మరింత పాపులర్ అయ్యింది.
అయితే ఇప్పుడు మహేష్ బాబుతో రాజమౌళి చేయబోయే సినిమాకి ఈ కాంబినేషన్ కుదరడం లేదు. ఈ సినిమాకి సెంథిల్ స్థానంలో పిఎస్ వినోద్ ని తీసుకున్నారని తెలుస్తోంది. వేరే కమిట్మెంట్స్ వలన సెంథిల్ ఈ సినిమా చేయడం కుదరడం లేదు. అయితే ఈ వార్త బయటికి వచ్చినప్పటి నుంచి మహేష్ బాబు ఫ్యాన్స్ లో బెంగ మొదలైయింది. రాజమౌళి టీంలో సెంథిల్ లేకపోవడంతో అదొక లోటుగా ఫీలౌతున్నారు కొందరు ఫ్యాన్స్.
కానీ ఈ విషయంలో బెంగ అవసరం లేదని రాజమౌళి ట్రాక్ రికార్డ్ చూసి చెప్పొచ్చు. కెమరామెన్ కీలకమే కానీ.. రాజమౌళి అన్ స్టాపబుల్ హిట్ రికార్డ్ దీనికి అతీతంగా వుంది. ‘స్టూడెంట్ నెంబర్1’ చిత్రం కోసం హరి అనుమోలుతో కలిసి పని చేశారు రాజమౌళి. రెండో సినిమా ‘సింహాద్రి’కి కె రవీంద్రబాబు డీవోపీగా చేశారు. తర్వాత సెంథిల్ తో ప్రయాణం కొనసాగింది. ఐతే మధ్యలో ‘మర్యాదరామన్న’ సినిమాకి కూడా డీవోపీ మార్పు జరిగింది. ఆ సినిమాకి సి.రామ్ ప్రసాద్ తో కలసి పని చేశారు రాజమౌళి. సెంటిమెంట్ ప్రకారం చూసుకున్న మధ్యలో డీవోపీని మార్చి తన విజయపరంపర కొనసాగించారు రాజమౌళి.
ఇక పిఎస్ వినోద్ కూడా మాములు కెమరామ్యాన్ కాదు. టెక్నికల్ గా చాలా సౌండ్. పవన్ కళ్యాణ్ తో చేసిన పంజా.. ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్. విజువల్స్ విజయంలో ఆ సినిమా మంచి స్థాయిలో వుంటుంది. అందులో పవన్ కళ్యాణ్ ని చూపించిన విధానం ఫ్యాన్స్ తెగ నచ్చుతుంది. తర్వాత ఆయన తెలుగులో చేసిన మనం, ఊపిరి, ధ్రువ, అరవింద సమేత, అల వైకుంఠపురం .. ఇవన్నీ విజువల్ గా టాప్ క్లాస్ గా వుంటాయి. ఇక ‘సీతారామం’ అయితే దృశ్యకావ్యంగా పేరుతెచ్చుకుంది. ఇప్పుడు మహేష్ ‘గుంటూరు కారం’ కి కూడా ఆయనే చేస్తున్నారు. రాజమౌళి విజన్ ని అర్ధం చేసుకోవడంలో పిఎస్ వినోద్ ది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి.