హైదరాబాద్: ప్రేక్షకులను ఆకట్టుకోవటంకోసం – తమది కుటుంబ సమేతంగా చూసే సినిమా అని నిర్మాతలు, దర్శకులు చెబుతూ ఉంటారు. అయితే రాజమౌళి కుటుంబ సమేతంగా సినిమాలు రూపొందిస్తుంటారు. రాజమౌళి రూపొందించే సినిమాల వెనక ఆయన కుటుంబ సభ్యుల కృషి అధిక శాతం ఉంటుంది. ఇంతవరకూ ఒక్క ఫెయిల్యూర్ లేకుండా ఆయన సాధిస్తున్న అప్రతిహత విజయాలకు ఇదికూడా ఒక కారణమని చాలామంది అంటూ ఉంటారు. రాజమౌళి చిత్రాలన్నింటికీ తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథలు అందిస్తారు. ఆయన పెదనాన్న కొడుకైన కీరవాణి సంగీతం అందిస్తుంటారు. భార్య రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తారు. కుమారుడు కార్తికేయ, వదిన – కీరవాణి భార్య శ్రీవల్లి ‘బాహుబలి’ చిత్రానికి ప్రొడక్షన్ వ్యవహారాలు చూసిన సంగతి తెలిసిందే. మరో పెదనాన్న కుమారుడు కాంచి స్క్రిప్ట్ వర్క్ చేస్తుంటారు… కామెడీ వేషాలు కూడా చేస్తుంటారు. రాజమౌళి, సంగీత దర్శకులు కళ్యాణి మాలిక్, శ్రీలేఖ అన్నాదమ్ముల పిల్లలే. రాజమౌళి పెదనాన్న శివశక్తిదత్తా ‘అర్థాంగి’, ‘చంద్రహాస్’ వంటి సినిమాలను రూపొందించారు.
ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ అంశంపై రాజమౌళి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. కుటుంబంలోని అందరూ సినిమాకు సంబంధించిన ఏదో ఒక విభాగంలో అసోసియేట్ అవటం తన అదృష్టమని అన్నారు. తాను డైరెక్టర్ అవ్వకముందే తన తండ్రి, పెదనాన్న సినిమారంగంలో ఉన్నారని చెప్పారు. తనతో దగ్గరగా ఉండటానికి, హెల్ప్ చేయటానికి రమ వచ్చిందని తెలిపారు. ఈగ చేసిన తర్వాత ‘బాహుబలి’ వంటి పెద్ద చిత్రం చేస్తున్నపుడు ఖచ్చితంగా మరింత హెల్ప్ అవసరమని వదిన, కీరవాణి భార్య వచ్చిందని చెప్పారు. అలా కొంతమంది ముందునుంచీ సినిమాలలోనే ఉన్నవారు, కొందరు తర్వాత వచ్చిన వారు ఉన్నారని తెలిపారు. అన్నీ సెట్ అవ్వటం అదృష్టమని చెప్పారు. దీనివలన ఫ్యామిలీకి దూరంగా ఉన్నాననే ఫీలింగ్ కూడా ఉండదని అన్నారు. చాలామంది టెక్నీషియన్లు రాజమౌళితో చేసే అవకాశం కోల్పోతున్నారని అడగగా, ఏ దర్శకుడైనా తనకు అనుకూలంగా ఉండే టెక్నీషియన్తోనే మంచి ఔట్ పుట్ తీసుకు రాగలుగుతాడని అన్నారు.