ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ సినీ కధా రచయిత కె.వి.విజయేంద్ర ప్రసాద్ కి చెక్ బౌన్స్ కేసు నుండి నిన్న విముక్తి లభించింది. ఆయనపై సినీ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు 2011లో చెక్ బౌన్స్ కేసు వేశారు. విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన రూ.30 లక్షల చెక్ ని ఆయన ఆంధ్రా బ్యాంక్ లో జమా చేయగా, ఆయన ఖాతాలో సరిపోయినంత సొమ్ము లేకపోవడంతో అది బౌన్స్ అయింది. అప్పుడు చెంగల వెంకట్రావు అదే విషయాన్ని విజయేంద్ర ప్రసాద్ కి తెలియజేసి తన డబ్బును వాపసు చేయవలసిందిగా కోరారు. కానీ ఆయన స్పందించకపోవడంతో యలమంచిలి ఏజేఎఫ్సీఎం కోర్టులో విజయేంద్ర ప్రసాద్ పై 2011లో చెక్ బౌన్స్ కేసు వేశారు. అప్పటి నుండి ఆ కేసు కూడా రాజమౌళి సినిమా షూటింగులా సాగుతూనే ఉంది. ఇరు పక్షాల న్యాయవాదుల వాదోపవాదనలు ముగియడంతో నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు యలమంచిలి ఏజెఎఫ్సీఎం కోర్టు న్యాయమూర్తి యజ్ఞనారాయణ తుది తీర్పు వెలువరించారు. ఈ కేసులో సరయిన ఆధారాలు లేని కారణంగా కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. విజయేంద్ర ప్రసాద్ కూడా నిన్న తన లాయర్లతో కలిసి యలమంచిలిలో కోర్టుకు హాజరయ్యారు.