కథలేమీ గాల్లోంచి పుట్టవు. ఏ దర్శకుడైనా ఎక్కడో ఓ చోట నుంచి స్ఫూర్తి పొంది రాసుకోవాల్సిందే. రాజమౌళి తీసిన ఏ సినిమా చూసినా, అలాంటి స్ఫూర్తి కనిపిస్తుంటుంది. సింహాద్రి నుంచి మొన్నటి బాహుబలి దాకా.. పాత సినిమాల ఛాయలు, ఫార్ములాలూ కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. అయితే.. వాటిని తెలివిగా తన శైలికి తగ్గట్టుగా ఎడాప్ట్ చేసుకున్నాడు జక్కన్న. అది తన బలం.
ప్రస్తుతం తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్.ఆర్.ఆర్’కీ స్ఫూర్తి ఉంది. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల కథ ఇది. వాళ్లిద్దరి ప్రయాణం, పోరాటం తెరపై చూపిస్తున్నాడు. నిజానికి చరిత్రలో అల్లూరి, కొమరం కలిసినట్టు ఎక్కడా లేదు. వాళ్లవి వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు పోరాటాలు. కానీ.. ఇద్దరినీ కలిస్తే ఎలా ఉంటుంది? అన్నది జక్కన్న ఊహా. ఇలాంటి కల్పిత కథలు తెలుగునాట చాలానే కనిపిస్తాయి.
రాముడికి పరమభక్తుడు ఆంజనేయుడు. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆంజనేయుడు గుండెలు చీలిస్తే శ్రీరాముడే దర్శనమిస్తాడు. రాముడికి కూడా ఆంజనేయుడు కంటే విశ్వాస పాత్రుడు మరొకడు లేడు. అలాంటిది.. ఇద్దరూ ఒకరిపై మరొకరు యుద్ధానికి తలపడితే ఎలా ఉంటుందన్న ఊహతో వచ్చిన సినిమా ‘రామాంజనేయ యుద్ధం’.
మహాభారతంలోనే కాదు, మన పురాణాల్లో ఎక్కడా కృష్ణుడు, అర్జునుడు యుద్ధం చేసినట్టు లేదు. ఎవరూ ఎక్కడా చెప్పలేదు, రాయలేదు. కానీ.. కృష్ణుడు, అర్జునుడు తలపడితే ఎలా ఉంటుందన్న ఆలోచనకు రూపం.. ‘కృష్ణార్జున యుద్ధం’. ఇది కూడా హిట్టే. భీముడు, ఆంజనేయుడు.. ఇద్దరూ బలవంతులే. కానీ ఇద్దరి యుగాలు వేరు. అయినప్పటికీ ఇద్దరినీ కలిపేసి భీమాంజనేయ యుద్ధం సినిమా తీశారు. కృష్ణాంజనేయ యుద్ధం కూడా అదే టైపు. రెండు వేర్వేరు కాలాలకు చెందిన పాత్రల్ని ఒక చోట చేర్చడం, వాళ్ల మధ్య పోరు పెట్టడం మంచి టెక్నిక్. ఇప్పుడు జక్కన్న కూడా అదే ఫాలో అవుతున్నాడంతే.