బాలీవుడ్ లో తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, అలియాభట్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో టాలీవుడ్ నుంచి నాగార్జున కూడా చోటు సంపాదించుకున్నారు. ఈ సినిమా 3 భాగాలుగా రూపుదిద్దుకుంది. 2022 సెప్టెంబరు 9న ప్రపంచ వ్యాప్తంగా పార్ట్ 1 విడుదల కానుంది. దక్షిణాది భాషల్లో ఈ చిత్రానికి ఎస్.ఎస్.రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన టెక్నికల్ విషయాల్లో కూడా రాజమౌళి పాత్ర ఉంది. `బ్రహ్మాస్త్ర`ని విజువల్ వండర్ గా తీర్చిదిద్దడానికి చిత్రబృందం ప్రయత్నిస్తోంది. ఈ ప్రాజెక్టుపై దాదాపుగా 700 కోట్లు వెచ్చిస్తోంది. దీనికి సంబంధించిన గ్రాఫిక్స్ విషయంలో చిత్రబృందం రాజమౌళి సలహాలు తీసుకుంటోంది. ఈ చిత్ర ప్రారంభానికి ముందే దర్శకుడు అయాన్ ముఖర్జీ రాజమౌళిని పలు సందర్భాల్లో కలిశాడు. ఈ సినిమాని ఎలా తీయాలి? విజువల్ గా ఏ రేంజ్లో ఉండాలి? అనే విషయాలపై రాజమౌళి సలహాలు, సూచనలు తీసుకున్నాడు. బ్రహ్మాస్త్ర టీమ్ లో కరణ్ జోహార్ రాజమౌళిని లాక్కొచ్చాక… రాజమౌళి ప్రమేయం మరింతగా పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగాఉన్న విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలు, అందులోని సాంకేతికత… ఇవన్నీ రాజమౌళికి బాగా తెలుసు. అందుకే బ్రహ్మస్త్ర టీమ్ రాజమౌళి సలహాల్ని అందుకోవడానికి ముందుకొచ్చింది. ఇప్పుడు ఈ సినిమాలో ఆయన్ని భాగస్వామిగా చేర్చింది. రాజమౌళి పేరు తమ పోస్టర్ పై ఉండడం తమ అదృష్టమని కరణ్ జోహార్, అయాన్ ముఖర్జీ అన్నారంటే… రాజమౌళి ఇంపాక్ట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.