రాజమౌళితో సినిమా అంటే ఎగిరి గంతేస్తారు హీరోలు. ఆ హీరోకి కచ్చితంగా ఇండస్ట్రీ హిట్ పడిపోతుందని వాళ్లకు తెలుసు. రాజమౌళితో సినిమా చేస్తే – సినిమా ప్రపంచం దృష్టి తమవైపుకు తిప్పుకోవచ్చన్నది ఆశ. అయితే… ఈ ఆనందం ఒకవైపు ఊరిస్తుంటే, మరో వైపు బ్యాడ్ సెంటిమెంట్ భయపెడుతుంటుంది.
రాజమౌళి ట్రాక్ రికార్డ్ చూడండి. తనతో సినిమా తీసి, హిట్టుకొట్టిన ఏ హీరోకీ.. మరో హిట్టు చూడ్డానికి చాలా కాలం పడుతుంది. రాజమౌళి మానియా నుంచి బయటపడి, మరో హిట్టు కొట్టి, నిరూపించుకోవడం గగనం అయిపోతుంది. అందుకు లేటెస్ట్ ఉదాహరణ.. ప్రభాస్. బాహుబలి తరవాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇప్పుడు తన పారితోషికం వంద కోట్లు. ఇవన్నీ నిజాలే. కానీ రాజమౌళి సినిమా తరవాత పరిస్థితేంటి? సాహో ఏమైంది? నిన్నా మొన్నొచ్చిన `రాధే శ్యామ్` పరిస్థితేంటి?
సింహాద్రి తరవాత ఎన్టీఆర్ పరిస్థితేంటి?
మగధీర తరవాత రామ్ చరణ్ సంగతేంటి?
మర్యాద రామన్న చేశాక.. సునీల్ హీరోగా హిట్టు కొట్టాడా?
ఇలా అన్నీ ప్రశ్నలే. దీనికి సమాధానం లేదు. రాజమౌళి మీడియా ముందుకు ఎప్పుడొచ్చినా ఇదే ప్రశ్న ఎదురవుతుంది. మీతో సినిమా చేసిన హీరోలు, తదుపరి సినిమా ఫ్లాప్ అవుతుంది. ఈ సెంటిమెంట్ సంగతేంటి? అనే ప్రశ్న.. బెంగళూరు ప్రెస్ మీట్ లో రాజమౌళికి ఎదురైంది. వేదిక చరణ్, ఎన్టీఆర్లు కూడా ఉండగా ఈ ప్రశ్న వచ్చింనందుకు రాజమౌళి కాస్త ఇబ్బంది పడ్డాడు. కానీ సమాధానం చెప్పక తప్పలేదు. “ఈ ప్రశ్నకు ఇరవై ఏళ్లుగా సమాధానం చెబుతూనే ఉన్నా. కానీ మళ్లీ మళ్లీ అడుగుతూనే ఉన్నారు. ఓ సినిమా ఆడకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకే విషయానికి ముడి పెట్టి చూడలేం“ అని చెప్పుకొచ్చాడు.
పాపం.. అదే స్టేజీపై ఉన్న చరణ్, ఎన్టీఆర్లు ఏం చేయలేక ఒకరి మొహాలు ఇంకొకరు చూసుకోవాల్సి వచ్చింది.