రాజమౌళి అంటే పక్కా ప్రీ ప్లాన్డ్స్ మాస్టర్. ప్రతీదీ ప్రణాళిక ప్రకారం చేసుకొంటూ వెళ్తుంటారు. సినిమాలు, వాటి పబ్లిసిటీ అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. ఆయన టీమ్ కూడా చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది. రాజమౌళితో పని చేయడం అంటే స్కూలు కెళ్లినట్టే. క్రమశిక్షణలో రాజీ పడేదే లేదు. సెట్లో ఎవరూ సెల్ ఫోన్లు తీసుకురావడానికి వీల్లేదు అని గట్టిగా చెబుతుంటారు. హీరోల్ని మినహాయిస్తే ఎవరికీ సెల్ ఫోన్ల విషయంలో అనుమతి లేదు. అవి ఉంటే.. సెట్లో సంగతులు లీక్ అయిపోతాయన్న భయం ఆయనది. అయితే.. ఇంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకొన్నా మహేష్ సినిమాలోని ఓ సీన్ లీకైపోయింది. ఇది రాజమౌళికి గట్టి షాక్.
మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో రూపుదిద్దుకొంటున్న సినిమా ప్రస్తుతం ఒడిస్సాలో షూటింగ్ జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. అక్కడ మహేష్ తదితరులపై తెరకెక్కించిన ఓ ఎమోషన్ సీన్ ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. టీమ్‌లోని సిబ్బందే ఇది లీక్ చేశారన్నది అనుమానం. సినిమా ఇప్పుడే మొదలైంది. అప్పుడే లీకుల బెడద షురూ అవ్వడం రాజమౌళి బృందాన్ని కలవర పెట్టే అంశమే. ఈ లీక్ ఎలా జరిగింది? దానికి కారణం ఎవరు? అనే విషయంపై రాజమౌళి ఆరా తీస్తున్నారు. వాళ్లపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.
నిజానికి మహేష్ సినిమా కోసం రాజమౌళి మరిన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకొన్నారు. సినిమా మొదలైన తరవాత… ఎండార్స్మెంట్లలో పాల్లొనకూడదని, ఎవరికీ ఫొటోలు ఇవ్వకూడదని, పబ్లిక్ ఈవెంట్స్ లో కనిపించకూడదని మహేష్‌కు షరతు. ఎందుకంటే గెటప్పు బయటకు వచ్చేస్తుందని భయం. మహేష్ కూడా అందుకు అంగీకరించాడు. అయితే.. లీకుల రూపంలో మహేష్ లుక్ ఎప్పుడో తెలిసిపోయింది. ఇప్పుడు సీన్లే బయటపడిపోతున్నాయి. ఇక ముందు రాజమౌళి మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.