బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?
ఈ ప్రశ్నకు సమాధానం తెలిసిన ఒకే ఒక్కడు.. ఎస్.ఎస్.రాజమౌళి. తెలుగు సినిమా చరిత్ర గర్వపడే సినిమా బాహుబలి రూపంలో అందించారాయన. ఇప్పుడు ఆ చరిత్రను పునరావృతం చేయాలన్న ఉద్దేశంతో బాహుబలి 2ని తెరపైకి తీసుకొస్తున్నారు. అనేక అంచనాల మధ్య ఈనెల 28న బాహుబలి 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా రాజమౌళితో చేసిన చిట్ చాట్ ఇది.
రిలీజ్ టైమ్ దగ్గర పడుతోంది.. టెన్షన్ పెరుగుతోందా?
అదెలాగూ ఉంటుంది కదండీ. పనిచేసేంత వరకూ… ఆత్రుతగా ఉంటాం. ఎప్పుడెప్పుడు ఫినిష్ చేద్దామా అనిపిస్తుంది. అదంతా అయిపోయాక.. రిజల్ట్ ఎలా ఉంటుందో అనే టెన్షన్ మొదలవుతుంది.
నిన్నా మొన్నటి వరకూ సినిమాకి చెక్కుతూనే ఉన్నార్ట..
అవునండీ.. చివరి నిమిషం వరకూ ఏదో ఓ కరక్షన్ చేయాల్సి వచ్చింది. నేనేతే `మరో రెండు వారాలు పోస్ట్ పోన్ చేద్దామా` అని శోభుని అడిగా. తను నవ్వుతూ `ఏం అక్కర్లెద్దు.. అన్నీ అనుకొన్నవి అనుకొన్నట్టుగా జరుగుతాయి` అని భరోసా ఇచ్చాడు.
అనుకొన్నది అనుకొన్నట్టు తెరపై చూపించాను.. అనిపించిందా?
ఏ దర్శకుడికీ పూర్తి స్థాయిలో సంతృప్తి ఉండదండీ. మన ఊహలకేం? ఏదైనా ఊహించొచ్చు. కానీ అనుకొన్న ప్రతీదీ తెరపై తీసుకురాలేం. నేనే కాదు… ఏ దర్శకుడికైనా అది సవాల్.
బాహుబలి మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏమైనా మార్చిందా?
మారకపోతే మనుషులు ఎలా అవుతాం? మారాల్సిందే. ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం వస్తుందని బాహుబలి నిరూపించింది.
దర్శకుడిగా మీ దృక్పథాలేమైనా మారాయా?
లేదండీ. దర్శకుడిగా నాలో ఎలాంటి మార్పు రాలేదు.
బాహుబలిలో ఇన్ని పాత్రలున్నాయి? ఏ పాత్రని తెరపై తీసుకురావడం కష్టం అనిపించింది?
నా దృష్టిలో అన్ని పాత్రలూ ఎక్కువే నండీ. ప్రతీ పాత్రనీ ఒకేలా ప్రేమించా. ఒక్కో పాత్రకు సంబంధించి క్షుణ్ణంగా అధ్యయనం చేశాం. ఏ పాత్ర గురించి ఏ చిన్న విషయం నన్ను అడిగినా నిద్రలో లేచి చెప్పేస్తా. బాహుబలి పాత్ర ఉందనుకోండి. వాడేం తింటాడు? వాడికి ఏం ఇష్టం? రాజ్యం ఏవైపు, శివగామి ఓ వైపు ఉంటే దానికి మొగ్గు చూపిస్తాడు? ఇలా సినిమాకి అవసరం ఉన్నా, లేకపోయినా దాదాపు 500 ప్రశ్నల వరకూ మాకు మేమే వేసుకొని, దానికి సమాధానాలు రాబట్టేవాళ్లం. ఇదంతా పాత్రని వీలైనంత స్పష్టంగా ఆవిష్కరించడానికి తోడ్పడిన విషయాలు.
బాహుబలి తొలి భాగానికి వచ్చిన స్పందన చూసి, రెండో భాగంలో మార్పులేమైనా చేయాలనిపించిందా?
బాహుబలి సినిమా రూపంగా రెండు భాగాలు గానీ, నా దృష్టిలో ఒకటే కథ. ముందు ఏం అనుకొన్నానో అదే తెరపై తీశాను. కాకపోతే.. తొలి
భాగం అద్భుత మైన విజయం సాధించింది కాబట్టి, రెండో భాగంపై అంచనాలు పెరుగుతాయి కాబట్టి.. ఇంకాస్త గ్రాండియర్‌గా తీర్చిదిద్దాం.
బాహుబలి కల సాకారమవ్వడానికి ప్రధాన కారణం ఎవరు?
ఒకరు కాదు.. ముగ్గురు ఉన్నారు. ఒకటి నా నిర్మాతలు. వాళ్లు జీవితాల్ని పణంగా పెట్టారు. రెండోది నా కుటుంబం. వాళ్లు లేకపోతే నేను లేను. నేను కన్న కలని కాపాడుకోవడానికి నేను కష్టపడితే, నన్ను కాపాడుకోవడానికి నా కుటుంబం శ్రమించింది. మూడోది ప్రభాస్. తను లేకపోతే ఈ సినిమానే లేదు.
ఓ స్టార్ దర్శకుడిగా భారీ పారితోషికం తీసుకొనే మీరు, ఒకే సినిమాపై ఐదేళ్లు కేటాయించడం సబబేనా?
ఆర్థికంగా ఈసినిమాతో నాకేం వస్తుంది అని ఆలోచించలేదు. ఈ సినిమా ప్రొటన్షాలిటీ నాకు తెలుసు. బాహుబలి లాంటి సినిమా తీస్తే ఆ ప్రభావం నా కెరీర్ మొత్తం మీద ఉంటుందని నాకు తెలుసు. నేనే కాదు, ప్రభాస్, రానా.. వీళ్లంతా తమ సినిమాల్నీ, పారితోషికాల్నీ త్యాగం చేసి ఈ సినిమా కోసం కష్టపడ్డారు.
అప్పుడే టికెట్లన్నీ అయిపోయాయి.. హౌస్ ఫుల్స్ బోర్డులు కనిపించబోతున్నాయి. మరోవైపు బ్లాక్ దందా కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిపై మీ స్పందన ఏంటి?
హౌస్ ఫుల్ బోర్డుల కోసమే కదా సినిమాలు తీసేది. కాకపోతే బ్లాక్ మార్కెటింగ్‌ని నేను సమర్థించను. ఓ టికెట్‌ని ఎక్కువ రేటుకు అమ్మడం వల్ల నిర్మాతలకు వచ్చే లాభం ఏమీ ఉండదు. ప్రభుత్వానికీ అదనంగా పన్ను రాదు.
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు.. అనే ప్రశ్నతో బాహుబలి 1ని ముగించారు. ఆ ప్రశ్న లేకపోతే పార్ట్ 2 కోసం ఇంత ఆసక్తి పెరిగేదా?
బాహుబలి 1 ముగింపు బాగుండాలని, రెండో పార్ట్ పై ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంతో చాలా రకాలైన క్లైమాక్స్‌లు అనుకొన్నాం. అందులో కట్టప్ప బాహుబలిని పొడిచే సన్నివేశం ఒకటి. ప్రేక్షకులకు అది మంచి కిక్ ఇస్తుందనుకొన్నాం గానీ.. మరీ ఆటం బాంబులా పేలుతుందనుకోలేదు. బాహుబలి 2 పై ఆసక్తి పెరగడానికి అదొక్కటే కారణం కాదు. విజువల్‌గా బాహుబలి 2 ఇంకెలా ఉండబోతోందో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. వాళ్లందరినీ సంతృప్తి పరిచేలానే పార్ట్ 2 తీశాం.
దర్శకుడిగా మీ కల, ఆశ ఏంటి?
దర్శకుడిగా అవ్వాలన్నదే నా కల. ఆశ. అది తీరిపోయింది.
మరి మహా భారతం?
ఆ సినిమా తీయాలని ఉన్న మాట నిజమే. అయితే అది ఇప్పుడు కాదు. కనీసం ఓ పదేళ్ల సమయం పడుతుంది. ఎందుకంటే ఆ సినిమా తీయాలంటే ఇప్పుడు నాకున్న జ్ఞానం సరిపోదు.
నెక్ట్స్ ఏంటి?
నా కుటుంబంతో కలసి సరదాగా సెలవలు ఎంజాయ్ చేయాలని వుంది. రెండు నెలల పాటు విహార యాత్రకు వెళ్లాలనుకొంటున్నాం. తిరిగొచ్చాక ఆలోచిస్తాం.