ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ కోసం కథానాయికల వేట కొనసాగిస్తున్నాడు రాజమౌళి. ఇందులో ముగ్గురు కథానాయికలకు ఛాన్సుంది. ఒక స్థానం కోసం విదేశీ నాయికని దిగుమతి చేయనున్నారని సమాచారం. మిగిలిన ఇద్దరూ ఇక్కడి వాళ్లే. ఆ ఇద్దరిలో ఒక నాయిక పాత్ర రష్మికకి దక్కే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఛలో సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది రష్మిక. గీత గోవిందంతో ఓ సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. దేవదాస్‌లోనూ అలరించింది. ఇప్పుడు విజయ్‌తోనే ‘డియర్ కామ్రెడ్’లో నటిస్తోంది. చలాకీ నటనకు మారుపేరైన రష్మిక.. రాజమౌళి దృష్టిలో పడిందని టాక్. రామ్‌చరణ్ పక్కన రష్మిక ఎలా ఉంటుందా? అని ఆలోచిస్తున్నార్ట. తొలి షెడ్యూల్ ఈనెల 19 నుంచి మొదలు కానుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేక సెట్లో పోరాట సన్నివేశాలతో సినిమా షూటింగ్ మొదలెడతారు. తొలి షెడ్యూల్లో కథానాయికలకు పనిలేదు. అందుకే… రాజమౌళికి కావల్సినంత సమయం దొరికింది. ఈలోగా.. డేట్లూ, కాల్షీట్లూ, కాంబినేషన్లు సరి చూసుకుని హీరోయిన్లను ఎంపిక చేసుకోవొచ్చు. ఆర్.ఆర్.ఆర్‌లో రష్మికకు చోటు దక్కితే మాత్రం… తన కెరీర్ మరో మెట్టు పైకి ఎక్కినట్టే అవుతుంది.