తెలుగు సినిమా బడ్జెట్‌కు అవధులు లేకుండా పోతోంది. వంద కోట్లు, రెండొందల కోట్లు కాస్తా. రూ.500 కోట్లు, రూ.1000 కోట్లు అయిపోతోంది. ఆర్.ఆర్.ఆర్కు అక్షరాలా రూ.500 కోట్లకుపైగానే ఖర్చు పెట్టారు. ఆ సొమ్ము రాబట్టే తెలివితేటలు కూడా రాజమౌళికి తెలుసు. కాబట్టే.. ఎంత ఖర్చయినా నిర్మాతలు వెనుకంజ వేయడం లేదు. ఇప్పుడు మహేష్ బాబు సినిమాకి అక్షరాలా రూ.800 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్టు ఇన్సైడ్ వర్గాల టాక్.
ఆర్.ఆర్.ఆర్ తరవాత మహేష్ తో ఓ సినిమా చేయబోతున్నాడు రాజమౌళి. ఈ సినిమా కథేమిటి? ఏ జోనర్? అనే విషయాలపై ఎప్పటి నుంచో వార్తలొస్తూనే ఉన్నాయి. మహేష్ ని రాజమౌళి `జేమ్స్ బాండ్`గా చూపిస్తాడని చెప్పుకొన్నారు. ఇప్పుడు అదే నిజం కాబోతోంది. జేమ్స్ బాండ్ లాంటి కథతోనే రాజమౌళి ఈ సినిమా తీస్తున్నాడు. అందుకు రూ.800 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా. ఇది చివరి క్షణాల్లో పెరగొచ్చు కూడా. ఇండియన్ సినిమా బాక్సాఫీస్ స్టామినా రూ.2000 కోట్లు. కాబట్టి…. ఎలాగైనా సరే, తిరిగి రాబట్టుకోవచ్చన్నది రాజమౌళి ధీమా. పైగా ఈ సినిమాని హాలీవుడ్ లోనూ విడుదల చేయాలనుకుంటున్నాడట. జేమ్స్ బాండ్ లాంటి స్టైలీష్ యాక్షన్ సినిమాల్ని హాలీవుడ్ లో బాగానే చూస్తారు. పూర్తిగా ఇంగ్లీష్ వెర్షన్ లో కూడా ఈ సినిమా విడుదల చేస్తారని. ఆ రకంగా రూ.800 కోట్లని రాబట్టుకోవడం అంత కష్టమేం కాదని…రాజమౌళి భావిస్తున్నాడట.