గౌతమిపుత్ర శాతకర్ణి గురించి జనం ఏం మాట్లాడుకొంటున్నారు? అభిమానులు ఏం ఆలోచిస్తున్నారు? బాక్సాఫీసు దగ్గర ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసుకొంటుంది? ఇలాంటి లెక్కల్ని కాసేపు పక్కన పెట్టి చూస్తే.. తెలుగు సినీ పరిశ్రమ దగ్గర మాత్రం శాతకర్ణి ఓ పెను మార్పుకు కారణభూతమవ్వబోతోంది. కేవలం 79 రోజుల్లో, రూ50 కోట్లలోపు బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. యుద్ధ సన్నివేశాలే ఏకంగా నాలుగున్నాయి. పైగా పిరియాడికల్ సినిమా. జార్జియాలో, మొరాకోలో షూట్ చేశారు. సినిమా చుట్టేసినట్టు ఎక్కడా అనిపించదు. హంగు హార్బాటాలకు, స్టార్లకు కొదవ లేదు. ఇంత తక్కువ సమచంలో ఇంత తక్కువ ఖర్చుతో ఇంత గొప్ప అవుట్ పుట్ క్రిష్ ఎలా ఇవ్వగలిగాడన్నది సినీ మేధావులకు సైతం అంతుపట్టడం లేదు. రూ.50 కోట్లకే ఇంత క్వాలిటీ మేకింగ్ తో సినిమా తీసినప్పుడు రూ.250 కోట్లతో రాజమౌళి బాహుబలిలాంటి బ్రహ్మాండం తీయడంలో ఆశ్చర్యం ఎందుకు?? నిజానికి క్రిష్ ముందు రాజమౌళి ఇమేజ్ చిన్నదిగా కనిపిస్తోంది. `రాజమౌళి కూడా క్రిష్‌లా ఫాస్ట్‌గా సినిమా ఎందుకు తీయడం లేదు..` అనే మాటలు వినిపిస్తున్నాయి. ఎవరి విజన్ వారిది… ఎవరి స్టైల్ వారిది. ఈ విషయంలో ఇద్దరికీ పోలికలు అనవసరం.
అయితే ఒక్కటి మాత్రం నిజం! రాజమౌళిలా క్రిష్ కూడా ఓ టార్గెట్ సెట్ చేసుకోవడం మంచిది. సంక్రాంతికల్లా సినిమా రిలీజ్ చేయాలి.. అనుకొన్నాడు. తీసి చూపించాడు. అదీ నిర్మాతలపై ఏమాత్రం భారం మోపనీయకుండా. `క్రిష్ నుంచి నేను చాలా నేర్చుకోవాలి…` అని రాజమౌళి అన్నాడంటే దానికి కారణం ఇదే కావొచ్చు. ఒక విధంగా క్రిష్ కి స్ఫూర్తి కూడా రాజమౌళినే. ఎలాగంటే… యుద్ధ సన్నివేశాల్ని ఈ స్థాయిలో తీయొచ్చు అంటూ బాహుబలితో రాజమౌళి నిరూపించాడు. అయితే.. వాటిని ఇంత తక్కువ ఖర్చులోనూ తీయొచ్చు అని క్రిష్ తీసి చూపించాడు. రాజమౌళి టీమ్ లో హాలీవుడ్ నిపుణులు ఉంటే… తనకున్న బడ్జెట్లో లోకల్ టాలెంట్ ని నమ్ముకొని గౌతమి పుత్రని తీర్చిదిద్దాడు క్రిష్. ఇద్దరిలో తేడా అదే. అన్నిటికంటే మించి.. క్రిష్ హ్యూమన్ ఎమోషన్స్‌ని బాగా పట్టేశాడు. మన మూలాల్ని, అందులో ఉన్న విలువల్ని ఎప్పుడూ ఏమాత్రం అశ్రద్ద చేయలేదు. గౌతమి పుత్రని ఓ కమర్షియల్ సినిమాగా తీర్చిదిద్దుతూనే…. తన లైన్ దాటలేదు. సరికదా..విమర్శకుల చేత కూడా సెభాష్ అనిపించుకొన్నాడు. బాహుబలి చూసి కొంతమంది విమర్శకులు పెదవి విరిచిన వైనం మనందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ క్రిష్ ఆ అవకాశం ఎవ్వరికీ ఇవ్వలేదు. అదే… వీరిద్దరిలో ఉన్న అసలైన తేడా!