ఎస్.ఎస్.రాజమౌళి – మహేష్‌బాబు సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. స్క్రిప్టు లాక్ అయిపోయింది. ఇప్పుడు డైలాగ్ వెర్షన్ మొదలవ్వాలి. అందుకోసం ఓ రచయిత కోసం అన్వేషిస్తున్నారు రాజమౌళి. సాధారణంగా రాజమౌళి సినిమా అనగానే సాంకేతికంగా ఓ బృందం పర్మినెంట్ గా పని చేస్తుంది. రచయితల్ని మాత్రం మారుస్తుంటారు. అంతకు ముందు చిత్రాలకు రత్నం, కాంచి డైలాగులు రాసేవారు. ‘ఆర్.ఆర్.ఆర్’ కోసం బుర్రా సాయిమాధవ్ వర్క్ చేశారు. ఆ సినిమాలో బుర్రా మార్క్ సంభాషణలు మెరిశాయి కూడా. మహేష్ సినిమా కోసం మాత్రం ఆయన ఓ కొత్త రచయిత కోసం గాలిస్తున్నారని సమాచారం. రాజమౌళి సినిమాల్లో ఎమోషన్, యాక్షన్‌కి పెద్ద పీట వేస్తారు. డైలాగ్ ఓరియెంటెడ్ సన్నివేశాలు ఆయన సినిమాల్లో పెద్దగా ఉండవు. కావల్సిన ‘కీ’ డైలాగ్స్ కూడా నేరేషన్ సమయంలో జక్కన్న ఫీడ్ చేసేస్తారు. కాబట్టి రచయితలకు పెద్దగా పని ఉండదు. ఆయన సన్నివేశంలో చెప్పదలచుకొన్న విషయాన్ని వీలైనంత షార్ప్‌గా రాయడమే రచయితల పని. ‘బాహుబలి’ కోసం కూడా ఆయన పేరున్న రచయితల్నేం తీసుకోలేదు. ఆయన టీమ్‌లో ఉండేవాళ్లతోనే ఓ వెర్షన్ రాయించుకొన్నారు. మహేష్ సినిమా కోసం ఆయన ఎవర్ని ఎంచుకొంటారన్న విషయంలో ఆసక్తి నెలకొంది.