సైజ్ జీరో పుణ్యమా అని అనుష్క బాగా లావైపోయింది. ఆ సినిమా కోసం బరువు పెరిగిన స్వీటీ.. దాన్ని తగ్గించుకోవడానికి ఇప్పటికీ ఆపసోపాలు పడుతోంది. అనుష్క ఇంకా బొద్దుగానే ఉందన్న విషయం మొన్నొచ్చిన సింగం 3 కూడా రుజువు చేసింది. అయితే సడన్ గా బాహుబలి 2 లో అనుష్క స్లిమ్ గా మారిపోయింది. బాహుబలి 2 కోసం విడుదల చేసిన పోస్టర్ లో అనుష్క స్లిమ్ గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. బాహుబలి 1 సమయంలో తీసిన స్టిల్ ఇది.. ఇప్పుడు ఆలస్యంగా విడుదల చేశారు.. అని కొందరు చెబితే, అదేం కాదు… అనుష్కని స్లిమ్ గా చూపించడానికి రాజమౌళి గ్రాఫిక్స్ ని వాడుకొన్నాడు అని మరికొందరన్నారు. ఇప్పుడు అదే నిజమైంది. అనుష్క స్లిమ్ గా కనిపించడానికి కారణం సీజీ వర్కే అని రాజమౌళి ఒప్పుకొన్నాడు.
సైజ్ జీరో కోసం బరువు పెరిగిన అనుష్క.. బాహుబలి 2 కోసం బరువు తగ్గడానికి ప్రయత్నించిందని, పోస్టర్ లో చూపించినంత సన్నగా లేకపోయినా, జనాలు అనుకొన్నంత లావుగా కూడా అనుష్క లేదని జక్కన్న క్లారిటీ ఇచ్చేశాడు. అంతేకాదు.. అనుష్కని అలా చూపించడానికి సీజీ వర్క్‌పై ఆధారపడ్డామని రాజమౌళి ఒప్పుకొన్నాడు. అయితే ఇదేం కొత్తేం కాదని, పైగా.. నేరమూ కాదని, ఇలా చూపించడం సర్వసాధారణమైన విషయమని, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి పాడేశాడు రాజమౌళి. అయితే అనుష్క వల్లే బాహుబలి 2 ఆలస్యమైందన్న వార్తల్ని ఖండించాడు జక్కన్న. అనుష్క బొద్దుగా మారడం… బాహుబలి 2 టీమ్ ని ఇబ్బంది పెట్టిందన్నమాట వాస్తవం. అందుకే… సీజీ వర్క్‌లపై ఆధారపడాల్సివచ్చింది. లావు తగ్గడానికి అనుష్కకు రాజమౌళి ఓ డెడ్ లైన్ పాస్ చేశాడని, ఇదే విషయం స్వీటీ అవమానంగా భావించిందని, అనుష్కకీ రాజమౌళికీ ఈ విషయమై ఇప్పటికీ కమ్యునికేషన్ గ్యాప్ ఉందంటున్నారు సినీ జనాలు. మరి వీటిపై రాజమౌళి ఎలా స్పందిస్తాడో ఏంటో??