బాహుబలి 2 గురించి రోజుకో వార్త. వాటిపై రాజమౌళి దాదాపుగా క్లారిటీ ఇస్తూనే వస్తున్నాడు. తాజాగా బాహుబలి 2 కోసం 4 క్లైమాక్స్ లు షూట్ చేశారని, అందులో ఏది ఫిక్స్ చేస్తారో చెప్పలేమని గుసగుసలు వినిపించాయి. వీటిపై జక్కన్న క్లారిటీ ఇచ్చేశాడు. ఒక క్లైమాక్స్ తీయడానికే తల ప్రాణం తోకకు వచ్చిందని, నాలుగు క్లైమాక్స్‌లు ఎలా తీస్తామని.. కుండ బద్దలు కొట్టేశాడు. అయితే… క్లైమాక్స్ కోసం రెండు మూడు వెర్షన్లు అనుకొన్న మాట వాస్తవమే అని, అయితే షూట్ చేసింది మాత్రం ఒక్క క్లైమాక్సే అని తేల్చేశాడు. తొలిభాగంకి వచ్చిన స్పందన చూసి, రెండో భాగంలో కథ ఏమాత్రం మార్చలేదని… కాకపోతే విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో, యాక్షన్ పార్ట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొమన్నాని చెప్పుకొచ్చాడు జక్కన్న.
బాహుబలి 2 కథ ఇలా ఉండబోతోంది అంటూ సోషల్ మీడియాలో కొన్ని కథలు షికారు చేస్తున్నాయి. వాటిపై కూడా రాజమౌళి మనసు విప్పాడు. కొన్ని కథలు దగ్గరగా వచ్చాయని, అయితే ఎంత మంది ఎన్ని రకాలుగా ఊహించినా.. తెరపై చూపించిన విధానం చూసి సంభ్రమాశ్చార్యాలకు లోనవుతారంటున్నాడు జక్కన్న. ”మహాభారతం, రామాయణం కథలు మనకు తెలుసు. కానీ.. వాటిని ఎంత అందంగా చెప్పామన్నదే ముఖ్యం. బాహుబలి కథ కూడా అంతే. కొంతమంది బాహుబలి 2లో ఏం జరిగి ఉండొచ్చో ఊహించొచ్చు. కానీ ఎలా… అనేది ఆసక్తికరం. వాళ్ల ఊహలకు అందనంత అందంగా చూపించామనుకొంటున్నాం” అంటున్నాడు రాజమౌళి.
https://www.youtube.com/watch?v=qD-6d8Wo3do