రాజమౌళి దర్శక ధీరుడే కావొచ్చు.
అపజయం ఎరుగని చరిత్ర ఉండొచ్చు.
తెలుగు సినిమాకి ప్రపంచ ఖ్యాతి తీసుకొచ్చిన వాడే అయ్యుండొచ్చు.
తనో పర్ఫెక్షనిస్ట్.. అనుకోవొచ్చు.
కానీ ఆయనకెప్పుడూ ఓ విషయంలో క్లారిటీ మిస్ అవుతుంటుంది. అది తన సినిమా రిలీజ్ డేట్‌పై.
ఆర్.ఆర్.ఆర్ ఎప్పుడొస్తుందా? అని ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. తెలుగులో రూపొందిన మరో భారీ బడ్జెట్ సినిమా.. పాన్ ఇండియా ప్రాజెక్ట్. పైగా ఎన్టీఆర్ – చరణ్‌ల మల్టీస్టారర్. చరణ్, ఎన్టీఆర్‌లను ఒకేసారి, ఒకే తెరపై చూద్దాం అన్న ఆశ.. అభిమానులది. రాజమౌళి ఆ రిలీజ్ డేట్ చెప్పేస్తే – మన సినిమాల షెడ్యూల్ ఏమిటో తేల్చుకోవొచ్చు అన్న ఆత్రం… మిగిలిన నిర్మాతలది. కానీ రాజమౌళి తన సినిమా రిలీజ్ డేట్ చెప్పడు. మిగిలిన వాళ్లని సినిమా రిలీజ్ చేసుకోనివ్వడు.
అక్టోబరు 13న వస్తున్నాం.. అని నిన్నామొన్నటి వరకూ డంకా బజాయించి మరీ చెప్పాడు రాజమౌళి. ఆ రోజున ఆర్.ఆర్.ఆర్ రావడం అసాధ్యం అని టాలీవుడ్ ముందు నుంచీ అనుకుంటూనే ఉంది. అయినా సరే.. ప్రతీ పోస్టర్‌పైనా అదే డేట్ ప్రింట్ చేసి, నిర్మాతల్ని కన్ఫ్యూజ్ చేశాడు. సంక్రాంతికి ఈ సినిమా రాదని ముందే తేలిపోవడంతో.. సంక్రాంతి బరిలో 5 సినిమాలు నిలిచాయి. రిలీజ్‌డేట్లు కూడా ప్రకటించాయి. ఇప్పుడు సడన్ గా… రాజమౌళి దృష్టి సంక్రాంతి సీజన్‌పై పడింది. జనవరి 8న తన సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇది మిగిలిన సంక్రాంతి సినిమాలకు షాక్ ఇచ్చే విషయం.
ఎందుకంటే ఆర్.ఆర్.ఆర్ కి పోటీగా వెళ్లాలని ఏ సినిమా అనుకోదు. ఆర్.ఆర్.ఆర్ వస్తుందంటే మిగిలిన సినిమాల్ని వాయిదా వేయాల్సిందే. కానీ.. ఇప్పటికే ఆయా సినిమాల రిలీజ్ డేట్లు వచ్చేశాయి. బయ్యర్లు అడ్వాన్సులు ఇచ్చేశారు. సంక్రాంతి ప్లానింగ్ లోనే ఆయా సినిమాలు సిద్ధం అవుతున్నాయి. సడన్ గా రాజమౌళి రిలీజ్ డేట్ ప్రకటిస్తే తమ మాటేమిటి? ప్రొడ్యూసర్ గిల్డ్ అంటూ ఒకటుంది. సినిమాల రిలీజ్ డేట్లు ముందుగా అక్కడ ఫిక్స్ కావాలి. ఒక సినిమాపై మరో సినిమా పోటీగా దించకూడదన్నది వాళ్లకు వాళ్లు పెట్టుకున్న రూలు. అలాంటప్పుడు.. ఆ రూల్ ని `ఆర్.ఆర్.ఆర్` అతిక్రమించగలదా? రాజమౌళి సినిమా కాబట్టి, పాన్ ఇండియా సినిమా కాబట్టి `మీరెప్పుడొచ్చినా మేం తప్పుకుంటాం` అని మిగిలిన సినిమాలు, నిర్మాతలూ అనాల్సిందేనా? ఆర్.ఆర్.ఆర్కి ఇప్పుడు ఈ వెసులు బాటుఇస్తే… భవిష్యత్తులో ప్రతీ పెద్ద సినిమా… తనకిష్టం వచ్చినప్పుడు డేట్ ఇచ్చుకుని వచ్చేస్తే..? అసలు గిల్డ్ ఎందుకు? ఆ నిబంధనలు ఎందుకు?
సంక్రాంతి చాలా కీలకమైన సీజన్. కనీసం నాలుగైదు సినిమాలకు ఛాన్సుంది. కానీ ఆర్.ఆర్.ఆర్ వస్తే… ఒకట్రెండు సినిమాలకు మించి స్కోప్ ఉండదు. ఆర్.ఆర్.ఆర్ అంచనాలకు అందుకోకపోతే పరిస్థితేమిటి? ఆ ఒక్క సినిమాతో సంక్రాంతి సీజన్ గడిపేయాల్సిందేనా?
రాజమౌళి ఇప్పటికైనా ఓ క్లారిటీకి రావాలి. తన సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించుకోవాలి. దానికే కట్టుబడి ఉండాలి. లేదంటే… చిత్రసీమలో అనవసరమైన కన్ఫ్యూజన్ మొదలవుతుంది. రిలీజ్ డేట్లు ప్రకటించడం, ఆ తరవాత వాయిదా వేయడం రాజమౌళికి మామూలే కావొచ్చు. కానీ ఆ ప్రభావం మిగిలిన సినిమాలపై గట్టిగా పడుతోంది. ఆర్.ఆర్.ఆర్ సినిమా హిట్టయినంత మాత్రాన తెలుగుసినిమా వెలిగిపోదు. మిగిలిన సినిమాలూ ఆడాలి. వాటికీ స్పేస్ ఇవ్వాలి. మరి ఆర్.ఆర్.ఆర్కి ఆ స్పృహ ఉందా?