ఆర్.ఆర్.ఆర్ ఆగిపోవడంతో చాలా సమస్యలు నెత్తిమీద వేసుకున్నట్టైంది. ఆర్.ఆర్.ఆర్ ప్రభావం మిగిలిన సినిమాల విడుదలలపై పడింది. ఈ సినిమాని ఎక్కువ రేట్లకు కొనుక్కున్న బయ్యర్లు ఎప్పుడో అడ్వాన్సులు చెల్లించేశారు. ఆ వడ్డీల భారం వారంతా మోయాల్సిన తప్పని పరిస్థితి. మరోవైపు ఫైనాన్షియర్ల బెడద. ఆర్.ఆర్.ఆర్కి రూ.180 కోట్ల ఫైనాన్స్ ఉంది. వాటన్నింటికీ నిన్నా మొన్నటి వరకూ డి.వి.వి.దానయ్యే బాధ్యుడు. ఇప్పుడు ఆ బాధ్యత రాజమౌళి తన నెత్తిమీద వేసుకున్నాడు. ఆర్.ఆర్.ఆర్ వాయిదా పడడంతో ఫైనాన్షియర్ల నుంచి ఒత్తిడి మొదలైందని, ఆ రూ.180 కోట్లకు రాజమౌళి సంతకం చేశాడని తెలుస్తోంది. సాధారణంగా పెద్ద సినిమాల విషయంలో ఫైనాన్షియర్లు ఎక్కువ సమస్యలు సృష్టించరు. పెద్ద సినిమా ఎప్పుడు వచ్చినా, తమ డబ్బులు సేఫ్ అన్న నమ్మకం ఉంటుంది. ఆర్.ఆర్.ఆర్‌పై కూడా ఉంది. అయితే రాజమౌళి… దానయ్యపై ఒత్తిడి తగ్గించడానికి, ఆ బాధ్యత కూడా తన భుజాన వేసుకున్నారు. ఇలాంటిదే… `ఆచార్య` విషయంలోనూ జరిగింది. `ఆచార్య` కూడా విడుదల తేదీ వాయిదా వేసుకోవాల్సివచ్చింది. మాట్ని ఎంటర్ టైన్మెంట్స్ పై ఒత్తిడి తగ్గించడానికి, ఆ సినిమా ఆర్థిక లావాదేవాలన్నీ.. తనపైన వేసుకుని, మాట్నీ సంస్థకు ఉపశమనం కలిగించాడు కొరటాల శివ. ఇలా.. నిర్మాతలపై భారం పడకుండా దర్శకులు కొమ్ము కాయడం చిత్రసీమకు నిజంగా శుభ శకునమే.