”నా సినిమాలని కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకుండా ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లడానికి వన్ ఆఫ్ ది మెయిన్ ఇన్స్పిరేషన్ సూర్య’ అన్నారు దర్శకులు రాజమౌళి. కంగువా ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు జక్కన్న. ఈ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. ”గజిని సినిమాని సూర్య దేశవ్యాప్తంగా ప్రమోట్ చేసిన తీరు నాకు ఎంతగానో నచ్చింది. నేను దాన్ని ఒక కేస్ స్టడీ లా తీసుకున్నాను. సూర్య ఎలా అయితే ఇక్కడికి వచ్చి ప్రమోషన్ చేస్తున్నారో, మనం కూడా అక్కడికి వెళ్లి అంతే చక్కగా ప్రమోట్ చేయాలని హీరోలకి నిర్మాతలకి చెప్పేవాడిని. సూర్య మన తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రేమను ఎలా అయితే పొందాడో మనం కూడా అక్కడి వారి ప్రేమను పొందాలని చెప్తుంటాను. నా పాన్ ఇండియా సినిమాలకి సూర్య స్ఫూర్తి’ అని చెప్పారు.
”సూర్య నేను కలిసి ఒక సినిమా చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఒకనొక వేడుకలో సూర్య మాట్లాడుతూ.. రాజమౌళి సినిమా అవకాశాన్ని మిస్ అయ్యానని చెప్పారు. కానీ నేను సూర్యతో సినిమా చేసే అవకాశాన్ని మిస్ అయ్యాను. ఎందుకంటే సూర్య అంటే నాకు చాలా ఇష్టం, తన నటన, స్క్రీన్ ప్రజెన్స్ చాలా ఇష్టం. తను ఫిలిం మేకర్ కంటే కథని ఎంచుకోవడంలో చూపే నిజాయితీ నాకు చాలా ఇష్టం. ఈ విషయంలో తనని చాలా గౌరవిస్తాను. కంగువా సినిమాని అద్భుతమైన లొకేషన్స్ లో చాలా పెద్ద పెద్ద సెట్స్ వేసి షూట్ చేశారు. టైలర్ చూస్తుంటే అది అర్థం అవుతుంది. తప్పకుండా ఈ సినిమా కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తుంది. ఇది బిగ్ స్క్రీన్ లో చూసే సినిమా. 14న తప్పకుండా అందరూ థియేటర్స్ లోనే చూడాలి’ అని కోరారు రాజమౌళి.